ఎంబీఏ ప్రశ్నపత్రం తారుమారు

27 Apr, 2016 04:14 IST|Sakshi

ఎస్వీయూలో పరీక్ష వాయిదా
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఎంబీఏ పరీక్షల్లో ప్రశ్నపత్రం తారుమారు కావడంతో పరీక్ష వాయిదావేశారు. ఎస్వీయూనివర్సిటీలో ప్రస్తుతం ఎంబీనీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం ఇండస్ట్రియల్ మార్కెటింగ్ పరీక్ష జరగాల్సి ఉంది.  విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకుని ఆన్సర్ షీట్ తీసుకున్నారు. ఇక ప్రశ్న పత్రం తీసుకుని పరీక్ష రాయడమే మిగిలింది. ఆ సమయంలో ప్రశ్నపత్రం తెరిచి చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు.

ఇండస్ట్రియల్ మార్కెటింగ్ ప్రశ్నపత్రం స్థానంలో రిటైల్ మార్కెటింగ్ ఉండటంతో ఏంచేయాలో తోచక పరీక్షల విభాగానికి తెలియజేశారు. వారు ప్రశ్న పత్రం కోసం వెతకగా కన్పించలేదు. ఇండస్ట్రియల్ మార్కెటింగ్ ప్రశ్నపత్రం స్థానంలో రిటైల్ మార్కెటింగ్ ప్రశ్నపత్రం రూపొందించినట్లు గుర్తించారు. చేసేదేమిలేక పరీక్ష వాయిదా వేశారు. అదేవిధంగా బుధవారం ఇంటర్నేషనన్ ఫైనాన్స్ అనే సబ్జెక్ట్‌పై పరీక్ష జరగాల్సి ఉంది. ఆ ప్రశ్నపత్రం కూడా సిద్ధంగా లేదని గుర్తించారు. బుధవారం పరీక్షను కూడా వాయిదా వేశారు.  ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తారు.
 
ప్రీపీహెచ్‌డీ పరీక్షలు వాయిదా
ఎస్వీయూలో ఈనెల 28 నుంచి జరగాల్సిన ప్రీ పీహెచ్‌డీ పరీక్షలను వాయిదావేశారు. అనివార్య కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగపు డీన్ ఎం.సురేష్ బాబు తెలిపారు. పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  ప్రశ్నపత్రాలు రాక పోవడం వల్లే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు