సామాజిక మార్పుపైనే దృష్టి

9 May, 2016 03:06 IST|Sakshi
సామాజిక మార్పుపైనే దృష్టి

తెనాలి: బుర్రిపాలెం అభివృద్ధితోపాటు అక్కడ సామాజిక మార్పుపై ప్రధానంగా దృష్టిసారిస్తానని ‘వెండితెర శ్రీమంతుడు’ ప్రిన్స్ మహేశ్‌బాబు చెప్పారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామాన్ని దత్తత తీసుకోవడం గొప్ప అవకాశమని చెప్పిన ఆయన.. గ్రామాభివృద్ధిలో తన సాయం, ప్రభుత్వ పథకాలతో సమకూరే నిధులతోపాటు ఇతరులనూ కలుపుకొని ముందుకు వెళతానని చెప్పారు. గుంటూరు జిల్లా బుర్రిపాలేనికి మహేశ్‌బాబు ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. తన చిన్నాన్న జి.ఆదిశేషగిరిరావు, బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలసి విలేకరులతో మహేశ్ మాట్లాడారు.

తన నాయనమ్మ నాగరత్నమ్మ, తాత, తండ్రికి ఈ ఊరంటే ఎంతో ఇష్టమని, వారు ఊరికి చాలా చే శారని చెప్పారు. ఇక్కడకు రావటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘శ్రీమంతుడు’ చేస్తున్న సమయంలో తన బావ జయదేవ్ బుర్రిపాలేన్ని దత్తత తీసుకోమని సూచించారన్నారు. అప్పట్లోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తే సినిమా కోసం చెప్పినట్టుగా ఉంటుందని, ఆ తర్వాతనే వెల్లడించానని చెప్పారు. గ్రామంలో ఆరోగ్యం, విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. విజయవాడ సిద్ధార్థ వైద్యకళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులు, ఆంధ్రా హాస్పటల్‌లచే వైద్యశిబిరాల నిర్వహణ, వైద్యసహాయం వంటివి చేపడతామన్నారు. రోడ్లు, డ్రెయిన్లపై ఇప్పటికే కొంత పని చేశామన్నారు.

తన నాయనమ్మ కట్టించిన స్కూలులో సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. తన ప్రధాన దృష్టి అంతా సామాజిక మార్పుపైనని స్పష్టంచేశారు. తరచూ ఇక్కడకు వస్తుంటానన్నారు. తెలంగాణలో తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని ఇప్పటికే తన భార్య నమ్రత సందర్శించారని, అక్కడ కార్యక్రమాలు ఆరంభిస్తున్నామని చెప్పారు. కాగా మహేశ్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. తమ నివాసం నుంచే మహేశ్‌బాబు వారికి పలుసార్లు అభివాదం చేశారు. అనంతరం టాపులేని వాహనంలో గ్రామంలో పర్యటించారు. గ్రామంలో చేపట్టనున్న రూ. 2.16 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్‌ను ఎంపీ గల్లా జయదేవ్ ఆవిష్కరించారు. ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులను మహేశ్‌బాబు ప్రారంభించారు. వీరితో తెనాలి ఆర్డీవో జి.నర్సింహులు, తహశీల్దారు జీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులున్నారు.

మరిన్ని వార్తలు