నకిలీ పత్రాలతో బ్యాంకు రుణానికి యత్నం : ఆరుగురిపై కేసు

16 Sep, 2016 01:50 IST|Sakshi
కాళ్ల : ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు రుణం పొందేందుకు యత్నించిన ముఠా గుట్టురట్టయింది. ఆరుగురిపై కాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..  నిజామాబాద్‌కు చెందిన ఏగిశాల లింగరాజు, హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన చంటిమళ్ల భాస్కరరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన పోతన వెంకటరవి కిశోర్, భీమవరం మెంటేవారితోటకు చెందిన మద్దాల క్లామత్‌బాబు, జువ్వలపాలెం గ్రామానికి చెందిన కొండేటి రవికుమార్, కాళ్ల గ్రామానికి చెందిన బాశింశెట్టి రామాంజనేయులు జువ్వలపాలెం స్టేట్‌ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు పథకం రచించారు. ఎస్సీబోస్‌ కాలనీ గ్రామానికి చెందిన ఇందుకురి సూర్యనారాయణరాజుకు చెందిన చెరువులను లీజుకు తీసుకున్నట్లు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించారు. వాటితో జువ్వలపాలెం స్టేట్‌బ్యాంకు లో రుణం పొందేందుకు బుధవారం యత్నించారు. ఆ బ్యాంకులో  రైతు ఇందుకూరి సూర్యనారాయణరాజుకు ఖాతా ఉండడంతో బ్యాంకు మేనేజర్‌ సంబంధిత రైతుకు సమాచారం ఇచ్చారు. దీంతో నకలీ పత్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టయింది. దీనిపై  రైతు ఇందుకూరి సూర్యనారాయణరాజు ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు