నాణ్యతకు తిలోదకాలు

28 Jul, 2016 23:19 IST|Sakshi
బెల్లంపల్లి : నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడంతో నిర్మించిన నెల రోజుల్లోనే రహదారి గుంతలమయంగా మారింది. ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గుత్తేదారు నాణ్యతగా నిర్మించకపోవడంతో బీటీ రహదారి చెదిరిపోయి గుంతలు పడుతున్నాయి. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం భీమిని మండలంలో ఇటీవల నిర్మించిన ఓ బీటీ రోడ్డు నాణ్యత ప్రమాణాలను వెక్కిరించే రీతిలో తయారైంది.
రూ.4.36 కోట్లతో..
భీమిని మండలం ముత్తాపూర్‌ గ్రామ క్రాస్‌ రోడ్డు నుంచి మెట్‌పల్లి గ్రామం వరకు కొన్నాళ్ల నుంచి గ్రామీణులకు సరైన రోడ్డు సదుపాయం లేకుండా పోయింది. కంకర రోడ్డుపై రాకపోకలు సాగించడానికి ఏళ్ల తరబడి నుంచి గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ఆ రోడ్డును బీటీగా మార్చడానికిSఇంజినీరింగ్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆయా గ్రామాల మధ్య ఉన్న 9.2 కిలోమీటర్ల పరిధిలో బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.36 కోట్ల నిధులను మంజూరు చేసింది. టెండర్‌ దక్కించుకున్న గుత్తేదారు గత నెల( జూన్‌)లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇన్నాళ్లు గతుకుల రోడ్లతో ఎన్నో అవస్థలు పడ్డ తమకు ఇక కొత్త రోడ్డు నిర్మాణంతో కష్టాలు కడతేరినట్లేనని ఆ ప్రాంతాల ప్రజలు ఎంతగానో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. సరిగ్గా నెల రోజులు కూడా తిరక్క ముందే రోడ్డుపై వేసిన బీటీ చెదిరిపోయింది.
అడుగుకో గుంత...
కొత్తగా నిర్మించిన రహదారి బీటితో తళతళ మెరిసిపోవాల్సి ఉండగా కళావిహీనంగా మారింది. 9 కిలోమీటర్ల పొడవున అడుగుకో గుంత ఏర్పడి అధ్వానంగా తయారైంది. చాలా మట్టుకు కొత్తగా వేసిన బీటి చెదిరిపోయి రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. అనేక చోట్ల పగుళ్లు తేలింది. కొన్ని చోట్ల రహదారి కోతకు గురైంది. రోడ్డుపై కనీసం అర ఇంచు మందం డాంబర్‌ లేకుండా పోయిందని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
పర్యవేక్షణ లేక..
రూ. కోట్ల అంచనాతో చేపట్టిన రహదారి నిర్మాణం సక్రమంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవల్సిన బాధ్యత సంబంధిత ఇంజినీరింగ్‌ శాఖ అధికారులపై ఉంటుంది. ఆగమేఘాల మీద, సరైన పద్ధతులు పాటించకుండా రోడ్డు నిర్మాణం జరిగిన∙ఇంజినీరింగ్‌ అధికారులు పట్టింపు చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికైనా రోడ్డు పునఃనిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామీణులు కోరుతున్నారు. 
బిల్లులు చెల్లించలేదు
– రాంచందర్, ఏఈ పంచాయతీరాజ్, భీమిని
ముత్తాపూర్‌ – మెట్‌పల్లి ప్రధాన రహదారి నిర్మించిన గుత్తేదారుకు ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. ఐదేళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యతలు పూర్తిగా గుత్తేదారుపైనే ఉంటాయి. ప్రస్తుతం బీటి చెదిరిపోయి రోడ్డుపై గుంతలు పడ్డాయి. నాణ్యతగా నిర్మించని గుత్తేదారుకు లీగల్‌ నోటీసులు ఇచ్చాం. రోడ్డు దుస్థితిని ఉన్నతాధికారుల దష్టికి ఈపాటికే తీసుకెళ్లాను. రోడ్డు పునఃనిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
 
మరిన్ని వార్తలు