మరిచిపోలేని అనుభూతి

6 Aug, 2016 00:56 IST|Sakshi
మరిచిపోలేని అనుభూతి
ఒలింపిక్స్‌ అంటేనే వందల కొద్ది ఈవెంట్లు.. వేల సంఖ్యలో క్రీడాకారులు.. లక్షలాది మంది అభిమానులు.. ఓ క్రీడా పండుగలా ఒలింపిక్స్‌ను జరుపుకుంటారు. అట్లాస్‌లో కనిపించే అన్ని దేశాలకు చెందిన క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు. ఈ క్రీడలు చూసేందుకు రెండు కళ్లు చాలవు.. వివరించేందుకు మాటలు సరిపోవు. అలాంటి ఒలింపిక్స్‌లో మన జిల్లాకు చెందిన వర్ధినేని ప్రణీత అడుగుపెట్టారు. 2008లో బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో ఆమె పాల్గొన్నారు. ఆనాటి ఒలింపిక్స్‌ విశేషాలను, అక్కడి అనుభవాలను ప్రణీత ‘సాక్షి’కి తెలిపారు. అవి ఆమె మాటల్లోనే..
 
బీజింగ్‌ ఒలింపిక్స్‌కు ముందు మెక్సికోలో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ వరకు వెళ్లాను. దీంతో నా ఫామ్‌పై నమ్మకం ఏర్పడింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే నెల రోజుల ముందు కోల్‌కతాలో నాలుగు రోజుల పాటు ట్రయల్స్‌ జరిగాయి. ఆర్చరీకి సంబంధించి దేశం మొత్తం నుంచి 8 మంది క్రీడాకారులు ట్రయల్స్‌లో పాల్గొన్నారు. ఇందులో నేను, డోలాబెనర్జీ, బొందలదేవి ఎంపికయాం. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌కి మన దేశం నుంచి 70 మందికి పైగా క్రీడాకారులం వెళ్లాం. భారత క్రీడాకారులందరికీ స్పోర్ట్స్‌ విలేజ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ కేటాయించారు. అంతకు ముందు ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన రాజ్‌వర్థన్‌సింగ్‌ రాథోడ్‌కు మా పక్క గది కేటాయించారు. మొదటిసారి ఒలింపిక్స్‌కు వచ్చిన మాకు.. ఆయన ఒత్తిడికి గురికావొద్దని.. లక్ష్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆ తర్వాత రోజుల్లో అభినవ్‌బింద్రా, విజేందర్‌సింగ్‌ కనిపించేవారు. అప్పటి వరకు టీవీల్లోనే చూసిన వ్యక్తులు మా పక్కనే తిరుగుతుంటే చూడడం గొప్ప అనుభూతి కలిగిచింది. 
 
ప్రతీకారం
బీజింగ్‌ ఒలింపిక్స్‌ కంటే ముందు మెక్సికోలో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా అమ్మాయికి నాకు మధ్య పోటీ జరిగింది. కొద్దిలో నాకు బంగారు పతకం మిస్‌ అయింది. ఒలింపిక్స్‌లో ఆర్చరీ వ్యక్తిగత విభాగం తొలిరౌండ్‌లో అదే ఆస్ట్రేలియా అమ్మాయి నాకు ప్రత్యర్థిగా ఎదురైంది. అప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. అంతకుముందే ఆ అమ్మాయి బలాబలాలు తెలియడంతో ఆమెను సులువుగా ఓడించగలిగాను. అయితే రెండో రౌండ్‌లో ఉత్తరకొరియా నుంచి గట్టిపోటీ ఎదురవడంతో నా పయనం ఆగిపోయింది. ఆర్చరీ టీం ఈవెంట్‌లో డోలా బెనర్జీ, బొందలాదేవి, నేను క్వార్టర్‌ ఫైనల్‌ వరకు వెళ్లాం. అక్కడ చైనా మాపై గెలిచింది.
 
చిరుతలా ఉసేన్‌ బోల్ట్‌
బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ప్రత్యేకంగా నిలిచింది ఉసేన్‌బోల్ట్‌ 100 మీటర్ల పరుగు పందెం. మా ఈవెంట్స్‌ ముగిశాక ఉసేన్‌బోల్ట్‌ మ్యాచ్‌ చూడాలని అంతా అనుకున్నాం. టికెట్లు తెప్పించుకుని మైదానంలో అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయాం. ఒలింపిక్స్‌ ప్రధాన స్టేడియం నెస్ట్‌ పూర్తిగా నిండిపోయింది. ఇండియా – పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను మించిన జనం, ఉత్సాహం, కేరింతలు.. ఉసెన్‌ బోల్ట్‌ పరిగెడుతుంటే కళ్లముందు అద్భుతం జరుగుతున్నట్లు అనిపించింది. 
 
సూపర్‌ ఫుడ్‌కోర్టు
అంతర్జాతీయ ఈవెంట్లు జరిగే మైదానాల్లోనే ఒలింపిక్స్‌ జరుగుతాయి. ఇందులో పెద్ద తేడా ఉండదు. పెద్ద తెరలు, కెమెరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెంట్స్, మ్యాచ్‌లు చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తారు. ఈ హంగామా చూస్తే తొలిసారి కొంత నెర్వస్‌గా అనిపిస్తుంది. స్పోర్ట్స్‌ విలేజ్‌ నుంచి గ్రౌండ్‌ వరకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు. హిందీ భాష వచ్చిన వలంటీర్లను నియమిస్తారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా చూసుకుంటారు. ఇక క్రీడాకారులు భోజనం చేసే ఫుడ్‌కోర్టును చూసి తరించాల్సిందే. మొదటి కౌంటర్‌ నుంచి చివరి కౌంటర్‌ వరకు వెళ్లాలంటే కనీసం మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అంతా పెద్దగా ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలకు చెందిన ఆహార  పదార్థాలు అందుబాటులో ఉంటాయి. మేము ఏషియా కౌంటర్‌లో ఇండియన్‌ ఫుడ్స్‌ తిన్నాం. 
 
రెండుసార్లు మిస్‌ అయ్యాను
బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత స్పోర్ట్స్‌ కోటాలో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. దీంతో కొంతకాలం అకాడమీకి దూరం అయ్యాను. పైగా 2012 లండన్‌ ఒలింపిక్స్‌ కు ఆర్చరీ టీమ్‌ను పంపేప్పుడు ట్రయల్స్‌ నిర్వహించలేదు. దీంతో నేను ఎంపికవ్వలేదు. 2016 రియో ఒలింపిక్స్‌కి ట్రయల్‌ పెట్టారు. ట్రయల్స్‌ షెడ్యూల్‌ ఉన్న సమయంలోనే నాకు పెళ్లి జరిగింది. దీంతో ట్రయల్స్‌కు నా పేరు ఇవ్వడం వీలు కాలేదు. నాతో ఆడిన బొందలాదేవి, లక్ష్మీరాణి రియో వెళ్లారు. వాళ్లు గెలిచి రావాలని కోరుకుంటున్నాను. 
 
ఆర్చరీపై చిన్నప్పటి నుంచి ఆసక్తి 
మా స్వగ్రామం పర్వతగిరి. తల్లిదండ్రులు వర్ధినేని కేశవరావు, విజయ. కల్లెడ ఆర్డీఎఫ్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నప్పుడు 2003 సంవత్సరంలో ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు ఆర్చరీని కల్లెడలో ఏర్పాటు చేశారు. కోల్‌కతా కోచ్‌ ప్రాబీర్‌దాస్‌ 20 మంది యువతీ యువకులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఆర్చరీ కేంద్రం వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, పాఠశాల ప్రధానోపాద్యాయుడు చొక్కారావు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆర్చరీలో శిక్షణ పొందాను. అన్నిటి కంటే ముఖ్యంగా నేర్చుకోవాలనే తపన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. టాటా అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్న సమయంలో సీనియర్లు డోలా బెనర్జీ, రాహుల్‌ బెనర్జీ, జయంతి బాగా సహకరించారు. కోచ్‌లు పూర్ణిమ మహంతి, తివారీలు కూడా తోడ్పాటు అందించారు. స్పోర్ట్‌ కోటాలో ఉద్యోగం సాధించినా తృప్తి లభించలేదు. అందుకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కోల్‌కతాలోని  స్పోర్ట్స్‌ అథారిటీ అఫ్‌ ఇండియాలో కోచ్‌గా వ్యవహరిస్తున్నా. ఎంచుకున్న ఫీల్డ్‌లో సంతోషంగా జీవిస్తున్నాను.ఆర్చరీకి మ్యాథమెటిక్స్‌ మాదిరిగా నిత్యం ప్రాక్టీస్‌ అవసరం.
  • 2006లో మెక్సికోలో జరిగిన కటేట్‌ అండ్‌ జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ మేరీడాలో సిల్వర్‌ మెడల్‌.
  • 2007లో జరిగిన రెండో ఆర్చరీ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ చైనీస్‌ ఇండివిజువల్‌లో సిల్వర్‌ మెడల్‌.
  • 2008లో థాయిలాండ్‌లో జరిగిన ఒకటో ఏషియన్‌ జీపీ పోటీల్లో బ్రాంజ్‌–1 మెడల్‌.
  • 2008లో జంషెడ్‌పూర్‌లో జరిగిన రెండో సౌత్‌ ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో గోల్డ్‌మెడల్‌–6. 
  • 2008లో టెహరాన్‌లో జరిగిన సెకండ్‌ ఏషియన్‌షిప్‌ పోటీలకు హాజరు.
  • 2008లో చైనాలోని బీజింగ్‌లో జరిగిన 29వ ఏషియన్‌ ఒలిం పిక్స్‌ పోటీలకు హాజరు.
  • 2008లో జరిగిన యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ అంటాలీ యా, టూకోలో టీమ్‌ సిల్వర్‌ మెడల్‌.
  • 2008లో పిలిపిన్స్‌లోని మనీలాలో జరిగిన మూడో ఏషియన్‌ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌.
  • 2009లోబ్యాంకాక్‌లో జరిగిన ఒకటో ఏషియన్‌ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌.
  • 2010 నుంచి 2015 వరకు వివిధ దేశాల్లో జరిగిన అంతర్జాతీయస్థాయి పోటీల్లో అనేక పసిడి, రజిత పతకాలు. 
  • ప్రస్తుతం గుజరాత్‌ సాయ్‌ అకాడమీలో కోచ్‌గా విధులు. 
  • అంతర్జాతీయస్థాయి రికార్డు 
మరిన్ని వార్తలు