టీడీపీలో ఉంటే భవిష్యత్తు శూన్యం

10 Apr, 2017 23:27 IST|Sakshi
టీడీపీలో ఉంటే భవిష్యత్తు శూన్యం
– పార్టీని వీడాలని శిల్పాకు కౌన్సిలర్ల సూచన
– త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానన్న శిల్పా
 
నంద్యాల: టీడీపీలో ఉంటే భవిష్యత్‌ ఉండదని.. పార్టీ మారాలని మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డికి టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సూచించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి, మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. రాజకీయ భవిష్యత్‌పై మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శిల్పా... సోమవారం ఇంట్లో సన్నిహితులతో రహస్య చర్చలు జరిపారు. మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ పీపీనాగిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచనతో పాటు 26మంది కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జిలు ఆయనను కలిశారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, పార్టీ మారాలని పలువురు కౌన్సిలర్లు శిల్పాపై ఒత్తిడి తెచ్చారు.టీడీపీలో భూమా చేరినప్పటి నుంచి తమకు ప్రాముఖ్యత తగ్గిందని, కనీసం పింఛన్లను తెప్పించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో.. ఎంపీ ఎస్పీవైరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌ కూడా తమకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారని..ఇంత మంది శత్రువుల మధ్య, మైనార్టీల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పార్టీలో ఉండటం సరికాదని.. తక్షణమే రాజీనామా చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొన్న శిల్పా..నాలుగైదు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ చర్చలపై విలేకరులు శిల్పాను ప్రశ్నించగా.. అప్పుడే తొందర ఎందుకని సమాధానాన్ని దాటవేశారు. 
 
మరిన్ని వార్తలు