ఇక యంత్రాలతోనే క్లీనింగ్‌

16 Aug, 2016 23:29 IST|Sakshi
ఇక యంత్రాలతోనే క్లీనింగ్‌

►  మనుషులు మ్యాన్‌హోళ్లలో దిగకుండా చర్యలు
►   మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం
►   నగర పారిశుధ్యానికి ఆధునిక వాహనాలు
►   ‘స్వచ్ఛ ఆటోల’ పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్‌

సాక్షి, సిటీబ్యూరో: ఇకముందు మనుషులు మ్యాన్‌హోళ్లలో దిగకుండా చేస్తామని, మెకనైజ్డ్‌ విధానాలతోనే మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసే విధానాలు అవలంభిస్తామని మున్సిపల్‌ మంత్రి కేటీ ఆర్‌ స్పష్టం చేశారు. ఇటీవల మ్యాన్‌హోల్‌లో దిగి నలుగురు మృతి చెందడాన్ని ప్రస్తావిస్తూ,  అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం ఇక్కడి పీపుల్స్‌ప్లాజాలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొత్తగా 176 స్వచ్ఛ ఆటో టిప్పర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 25 రెఫ్యూజి క్యాంపాక్టర్లు, 18 కొత్త స్వీపింగ్‌ యంత్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా జలమండలి ఇప్పటికే ప్రకటించగా, మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం కూడా ఇస్తామని స్పష్టం చేశారు. నగరంలోని కోటి మంది జనాభా కోసం పాటుపడుతున్న జీహెచ్‌ఎంసీ, జలమండలి కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసాగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ పేరుకు మహానగరమైనప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతున్న చెత్తవాహనాలు..

వాహనాల నుంచి రోడ్లపై పడుతున్న చెత్త వంటి సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారానికి, పారిశుధ్య కార్యక్రమాల సమర్థ నిర్వహణకు 15 ఏళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలన్నింటినీ తొలగించి, వాటిస్థానంలోlఅధునాతన వాహనాలు సమకూరుస్తున్నామన్నారు. భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాల్లో డంపర్‌ బిన్లు లేకుండా చేయాలనేది లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,  మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 

>
మరిన్ని వార్తలు