నాణ్యమైన విద్యనందించాలి

23 Jul, 2016 23:04 IST|Sakshi
నాణ్యమైన విద్యనందించాలి
బోధన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించాలని డీఈవో లింగయ్య ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. శనివారం బోధన్‌ మండలంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా పాఠశాలలో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సామర్థ్యాలను పరిశీలించారు. జాడిజమాల్‌పూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రాంపూర్‌ ప్రాథమిక పాఠశాల, కల్దుర్కి జెడ్పీ హైస్కూళ్లను పరిశీలించారు. తరగతి గదుల తీర్చాలని కల్దుర్కి వాసులు డీఈవోను కోరారు. అనారోగ్యానికి గురైన టెన్త్‌ విద్యార్థి శ్రీకాంత్‌ వైద్య ఖర్చుల కోసం ఉపాధ్యాయ బృందం, పూర్వ విద్యార్థులు పోగు చేసిన రూ.21 వేల నగదును డీఈవో విద్యార్థికి అందజేశారు. ఆయన వెంట ఎంఈవో కందారే శంకర్, సర్పంచ్‌ మరయ్య, విశ్రాంత హెచ్‌ఎం గోపాల్‌రెడ్డి తదితరులున్నారు.
‘మీలాగే డీఈవోనవుతా..’
ఖండ్‌గాం యూపీఎస్‌ను తనిఖీ చేసిన డీఈవో అక్కడి నుంచి బిక్‌నెల్లి తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించిన డీఈవో.. బడికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించగా, చదువుకునేందుకు వస్తున్నామని సమాధానమిచ్చారు. చదువుకుని ఏమి కావాలనుకుంటున్నారని అడిగితే.. మీలాగే డీఈవోనవుతానని ఓ బాలిక సమాధానం ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు తన పెన్నును బహుమతిగా ఇచ్చారు.

 

మరిన్ని వార్తలు