మానవత్వమా నువ్వెక్కడ?

5 Apr, 2016 04:44 IST|Sakshi
మానవత్వమా నువ్వెక్కడ?

మహబూబ్‌నగర్: మండుటెండల్లో సాటి మనిషి అలమటిస్తున్నా .. చూస్తూ వెళుతున్నారేగానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.మతిస్థిమితం లేని ఓ యువకుడు నడిరోడ్డుపై సొమ్మసిల్లిపడిపోయి సుమారు 6 గంటలపాటు నరకయాతన అనుభవిస్తున్నా ఏ హృదయమూ స్పందించలేదు. మానవత్వానికి మాయని మచ్చ తెచ్చే ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లాపూర్‌లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గల ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున మతిస్థిమితంలేని పాతికేళ్ల యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయం 11.30 గంటల వరకు అందరూ అతని పక్క నుంచే వెళుతున్నారేగానీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

మరో మతిస్థిమితం లేని యువకుడు రోషన్ మాత్రం రోడ్డుపై పడి ఉన్న యువకుడి లేపేందుకు పలుసార్లు విఫలయత్నం చేశాడు. ఎలాగైనా పక్కకు తీసుకెళ్లాలని అతడి చుట్టూ తిరుగుతున్నాడే గానీ అక్కడి నుంచి కదలడం లేదు. చివరకు అటువైపుగా వచ్చిన మండల సీఆర్‌పీ వెంకటస్వామి పరిస్థితిని గమనించి  రోడ్డుపై పడి ఉన్న యువకుడిని లేపి మంచి నీళ్లు తాపించాడు. రోడ్డుపక్కకు తీసుకొచ్చేందుకు విఫలయత్నం చేశాడు. కొద్దిసేపటికీ సమీప దుకాణాదారులు ఒక్కొక్కరు అక్కడికి చేరుకున్నారు. ఇంతలోనే నగర పంచాయతీ సిబ్బంది సదరు యువకుడిని పక్కకు తీసుకువచ్చి నీడన పడుకోబెట్టారు. 108 సిబ్బంది వచ్చి అతడిని పరీక్షించారు. అతడు అంబులెన్స్ ఎక్కేందుకు నిరాకరించడంతో వారు వెళ్లిపోయారు.       
 - కొల్లాపూర్

మరిన్ని వార్తలు