మువ్వన్నెల రెపరెపలు

15 Aug, 2017 22:50 IST|Sakshi
మువ్వన్నెల రెపరెపలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రం అనంతపురంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆద్యంతం దేశభక్తిని, సమైక్య భావనను చాటిచెబుతూ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ వేషధారణలతో చిన్నారులు భరతమాతకు నీరాజనాలర్పించారు. ‘స్వతంత్ర భారత దినోత్సవం’ అంటూ ఆర్డీటీ చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకానికి ప్రథమ స్థానం దక్కింది.

గార్లదిన్నెలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ, అక్షర హైస్కూల్‌ విద్యార్థులు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అనంతపురంలోని విశ్వభారతి హైస్కూల్, విజ్ఞాన్‌ పాఠశాల చిన్నారులు తమదైన నృత్య ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. దేశభక్తుల వేషధారణలతో అమితంగా ఆకట్టుకున్న చిన్నారులను ప్రత్యేకంగా అభినందించడమే కాక జ్ఞాపికలిచ్చి ప్రోత్సహించారు. అనంతరం జిల్లా ప్రగతిని చాటే ‘న్యూ ఇండియా’ పుస్తకావిష్కరణ జరిగింది. కదిరి మండలం ముత్యాలచెరువుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీకాంతం శ్యామమూర్తిని మంత్రి కాలువ శ్రీనివాసులతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు  ఘనంగా సన్మానించారు.
- అనంతపురం కల్చరల్‌:

ప్రత్యేక ఆకర్షణగా సినీనటులు
అనంతపురం చరిత్ర నేపథ్యంలో సాగే డాక్యుమెంటరీలో నటించడానికి నగరానికి విచ్చేసిన సినీనటులు రాజారవీంద్ర, పార్వతీశం, నవీద్‌ ఈ సందర్భంగా పరేడ్‌ మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మరిన్ని వార్తలు