పరిశ్రమలు పెట్టే వారికే భూములివ్వండి

30 May, 2017 23:30 IST|Sakshi
పరిశ్రమలు పెట్టే వారికే భూములివ్వండి
– అధికారులకు పరిశ్రమలశాఖా మంత్రి ఆదేశాలు 
– ఎంవోయూలు అమలయ్యేలా చర్యలు చేపట్టండి 
– జిల్లాలోని పరిశ్రమల స్థితిపై అధికారులతో సమీక్ష 
– కాకినాడ ఎస్‌ఈజడ్‌లో రోడ్డు సమస్యను పరిష్కరిస్తాం 
సాక్షి, రాజమహేంద్రవరం:  పరిశ్రమలు స్థాపిస్తామని ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న వారిలో ఎవరైతే ప్లాంట్లు ఏర్పాటు చేస్తారో వారికే భూములు కేటాయించాలని పరిశ్రమలశాఖ మంత్రి ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లాలోని పరిశ్రమల ఏర్పాటు పరిస్థితిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాతో కలసి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిశ్రమలశాఖ, ఏపీఐఐసీలలో ఉన్న ఎంవోయూలపై ఒక్కొక్కటిగా మంత్రి సమీక్షించారు. ఆసక్తి ఉన్న వారికే సమయం కేటాయించి వీలైనంత త్వరగా పరిశ్రమ పెట్టేలా శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
కాకినాడ ఎస్‌ఈజడ్‌కు రహదారి నిర్మించండి..
రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ, కాకినాడలోని ప్రత్యేక ఆర్థిక మండళ్లు ముఖ్యమైనవని మంత్రి చెప్పారు. శ్రీ సిటీలో పరిశ్రమలు వేగంగా స్థాపిస్తుండగా కాకినాడలో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. సమస్య ఎక్కడ ఉందో చెప్పాలని అధికారులను కోరారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో రోడ్డు సమస్య ప్రధానమైందని, ఇది పరిష్కారమైతే పరిశ్రమల స్థాపన వేగంగా జరుగుతుందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడ–ఉప్పాడ బీచ్‌ రోడ్డు, ఏడీబీ రోడ్డు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్‌ కార్తికేయ మిశ్ర పేర్కొన్నారు. ఉప్పాడ బీచ్‌రోడ్డును విస్తరించేందుకు ఇబ్బంది లేదని, విస్తరణకు ఇబ్బంది ఉన్నచోట బైపాస్‌ రోడ్డు వేస్తామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 23 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇంకా ఏర్పాటు కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. 
దివీస్‌ సమస్య ఉంది...
దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నా పరిశ్రమ ఏర్పాటుతో వారికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించి, ప్రజలతో చర్చించిన తర్వాతే పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టని వారికి ఇచ్చిన భూములను డీనోటిఫై చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బల్బుల ప్రదర్శనను మంత్రి సందర్శించి చార్జింగ్‌ ౖలñ టును కొనుగోలు చేశారు. సమీక్షా సమాశంలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్ర, పరిశ్రమలశాఖ జోనగ్‌ మేనేజర్‌ వి.గోపికృష్ణ, జనరల్‌ మేనేజర్‌ ఎ.వి.పటేల్, డిప్యూటీ డైరెక్టర్‌ వి.డేవిడ్‌ సుందర్, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు రఘుబాబు, కె.విశ్వేశరరావు, ఎస్‌ఈజెడ్‌ ప్రత్యేక అధికారి యం.సీతామహాలక్ష్మి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ వైఎస్‌ఎన్‌ ప్రశాద్, ఆర్‌టీవో సిరి ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు