ఒకే పరిధిలోకి గురుకులాలు సాధ్యమేనా?

21 Oct, 2015 02:40 IST|Sakshi
ఒకే పరిధిలోకి గురుకులాలు సాధ్యమేనా?

దీనిపై రెండున్నర నెలల కిందట సర్కారు ప్రకటన
నేటికీ ముందుకు సాగని ప్రయత్నాలు
వ్యతిరేకిస్తున్న కుల సంఘాలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ సంక్షేమశాఖలు సహా జనరల్ రెసిడెన్షియల్, మోడల్, కేజీబీవీ, సర్వశిక్ష అభియాన్ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలను ఒకే గొడుగు కిందకు తేవాలన్న ప్రభుత్వ ఆలోచన ఇంకా కార్యరూపం దాల్చడంలేదు. గురుకుల విద్యాసంస్థలన్నింటినీ ఒకే పరిధిలోకి తీసుకురావడంతోపాటు నియోజకవర్గానికి 10 చొప్పున గురుకులాలు ఏర్పాటు చేస్తామని సర్కారు ప్రకటించి రెండున్నర నెలలు గడిచినా నేటికీ ప్రాథమిక కసరత్తు సైతం మొదలు కాలేదు. ఈ విష యమై వివిధ కుల, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పరస్పర భిన్నంగా స్పందించడం, వేర్వేరు స్వభావాలు, నేపథ్యాలు, రిజర్వేషన్లు, ఇతర విధానాలున్న గురుకులాలను ఒక చోటు కు తీసుకురావడం ఆచరణలో ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తడం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒక చోటకు చేర్చాలన్న ప్రభుత్వ ఆలోచనపై ఆయా విభాగాల అభిప్రాయాలను తెలుసుకున్న ఎస్సీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అన్ని గురుకులాలను ఒక గొడుగు కిందకు తెస్తే తలెత్తే సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన వసతులు, ఉద్యోగుల సమస్యలు, ఇతరత్రా అంశాలను అందులో ప్రస్తావించారు. దీనిపై ఆయా శాఖల విభాగాధిపతులు, ఉద్యో గ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ కులసంఘాల ప్రతినిధులతోనూ ఆయన చర్చించారు.

నియోజకవర్గానికి 10చొప్పున రాష్ర్టవ్యాప్తంగా 1,200 గురుకులాల ఏర్పాటుపై ఎస్సీ, ఎస్టీ, బీసీ కులసంఘాలు హర్షం వ్యక్తం చేసినా అన్నింటినీ కలిపి సంయుక్త డెరైక్టరేట్ ఏర్పాటు చేయాలనుకోవడాన్ని వ్యతిరేకించాయి. వాటిని వివిధ సంక్షేమ సొసైటీలుగానే కొనసాగించాలని, ఆయా వర్గాల వారీగా సొసైటీల సంఖ్యను పెంచి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డెరైక్టరేట్ ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నాయి.

దీనివల్ల తమ జీతభత్యాలు, స్కేళ్లు, ఇతర అలవెన్సులు పెరుగుతాయని భావిస్తున్నాయి. ఉమ్మడి డెరైక్టరేట్ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని గిరిజన విద్యార్థి సమాఖ్య (టీఎస్‌ఎఫ్), బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 889 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండగా అందులో 135 సాంఘిక సంక్షే మ గురుకులాలు, 27 ఎస్టీ గురుకులాలు, 51 జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లు, 23 బీసీ గురుకులాలు, 12 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, 380 కస్తూర్భాగాంధీ బాలికా వికాస్ స్కూళ్లు, 192 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 3.16 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 18,510 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు వేర్వేరుగా నడుస్తుండగా వాటి బడ్జెట్‌ను కూడా వేటికవి విడిగా కేటాయిస్తున్నారు. ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సర్వీసు రూల్స్ వేర్వేరుగానే ఉన్నాయి. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా విడివిడిగా బీసీ,ఎస్టీ,మైనారిటీ సంస్థలు 1976 నుంచి కొనసాగుతున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీని 1984లో ప్రారంభించారు. ఎస్సీ గురుకులాల్లో ఒక ప్రిన్సిపల్ పోస్టు రాష్ట్రస్థాయిదికాగా మిగతా వాటిలో అవి జోనల్ పోస్టులుగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఉంటాయి.

ఎస్సీ గురుకులాల్లో మౌలికసదుపాయాలు మెరుగ్గా ఉండగా ఇతర గురుకులాల్లో అంతంతమాత్రంగానే సౌకర్యాలున్నాయి. ఈ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశం, ఇతరత్రా అంశాలకు సంబంధించి అమలుచేసే రిజర్వేషన్ విధానం వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో గురుకులంలో 640 మంది విద్యార్థులను చేర్చుకునే వీలుండగా దానినిబట్టి తరగతి గదులు, డార్మెటరీల ఏర్పాటు ఉంది. వీటిని ఒకే గొడుగు కిందకు తెస్తే ఆయా గురుకులాల పర్యవేక్షణ, ఆజమాయిషీ, మొత్తంగా చదువుసాగే తీరును సమీక్షించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు