కరువుపై యుద్ధమంటే ఇదేనా?

6 Sep, 2016 23:57 IST|Sakshi
కరువుపై యుద్ధమంటే ఇదేనా?
– సీఎంకు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రశ్న
 
నంద్యాలరూరల్‌: రాయలసీమలో నెలకొన్న కరువుకు శాశ్వత పరిష్కారం చూపకుండా, కేంద్రం నుంచి కరువు నివారణ నిధులు రాకుండా చేసేందుకు మరోమారు చంద్రబాబు కరువుపై రెయిన్‌గన్‌లతో యుద్ధమంటూ మోసం చేస్తున్నారని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్‌ బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాభావంతో ఖరీఫ్‌ పంటలు ఎండుతుంటే తనకు ఆలస్యంగా తెలిసిందని సీఎం చంద్రబాబు పేర్కొనడం దురదష్టకరమన్నారు. పైగా రెయిన్‌గన్‌లతో నీరు చల్లి బతికిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న చర్యలు, కరువు రైతుకు మనోధైర్యాన్ని కల్పించలేదన్నారు.
         శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854 అడుగులు కొనసాగించి తక్షణమే రాయలసీమ జలాశయాలు, చెరువులకు నీరు నింపాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి ఉంటే ఉన్న తక్కువ నీటిని రాయలసీమకు మళ్లించుకొనే అవకాశం ఉండేదన్నారు. ఇప్పటికైనా రాయలసీమపై చిత్తశుద్ధితో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దష్టి పెట్టాలని సీఎంకు సూచించారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854అడుగులు కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పాదయాత్ర మంచిదేనన్నారు. పార్టీలకు అతీతంగా రైతులు కరువును తరిమేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. 
 
         కేసీ కెనాల్‌ శాశ్వత నీటి వాటాను తక్షణమే విడుదల చేసి ఆయకట్టు పంటలను కాపాడాలని, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, హంద్రీనీవా ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక్క ఎకరాలో పంట ఎండినా అధికారులపై చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్న చంద్రబాబు అరెకరా పంట తడవడానికి కూడా నీటిని చూపించకపోవడం బాదేస్తోందన్నారు. అవాస్తవ ప్రచారం, ప్రజలను మోసం చేసే పద్ధతి మానుకొని శాశ్వత కరువు నివారణ చర్యలపై దష్టి పెట్టాలని హితవు పలికారు. 
 
>
మరిన్ని వార్తలు