జన్‌ధన్‌పై నల్లకుబేరుల కన్ను!

14 Nov, 2016 00:33 IST|Sakshi
అమలాపురం : 
ఎప్పుడూ నయాపైసా లావాదేవీలు జరగని జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో నగదు జమ అవుతోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఏడు లక్షలకు పైగా జన్‌ధన్‌ యోజన ఖాతాలున్నట్టు అంచనా. మామూలుగా బ్యాంకు ఖాతాలో రూ.2.50 లక్షల వరకూ పాత నోట్లను జమ చేసుకునే వీలు ఉండడంతో.. జన్‌ధన్‌ఖాతాలున్న పేదల ద్వారా నల్లకుబేరులు  నల్లధనాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ ఖాతాదార్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ముట్టజెప్పేందుకు సిద్ధపడుతున్నారు. అటువంటి ఖాతాదారుల కోసం తమ బంధుమిత్రుల ద్వారా ఆరాలు తీస్తున్నారు. కొంతమందికి ముందుగానే చెప్పుకుని ఉంచుకున్నారు.

ప్రస్తుతం కేవలం రూ.4 వేల వరకూ మాత్రమే పాత నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నగదు మార్చుకునేందుకు అనుమతి వచ్చినప్పుడు ఈ ఖాతాల ద్వారా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే జన్‌ధన్‌ఖాతాలతో పాత నోట్ల మార్పిడి చేస్తే ఖాతాదారులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకౌంట్లు తెరచినప్పటినుంచీ ఎటువంటి లావాదేవీలూ నిర్వహించకుండా.. ఇప్పుడు ఒకేసారి రూ.2 లక్షలకు పైగా నగదు మారిస్తే ఆదాయపన్ను విభాగం అధికారులు ఆరా తీసే అవకాశముంటుందని అంటున్నారు. ఇదే జరిగితే అకౌంట్లలో నగదు మార్చుకున్నవారికన్నా అందుకు సహకరించినవారు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు