దామోదరపై జర్నలిస్టుల ఫైర్..

2 Jun, 2016 23:21 IST|Sakshi
దామోదరపై జర్నలిస్టుల ఫైర్..

ఆయనను వెంటనే అరెస్టు చేయాలి
జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి
జర్నలిస్టు సంఘాల నేతల వినతి
నేటి నుంచి ఆందోళనబాట

సంగారెడ్డి జోన్ : మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌లో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అనుచరులతో దాడి చేయించడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆయనను వెంటనే అరెస్టు చేసి క్షమాపణలు చెప్పించే వరకు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించాయి.  ఈ మేరకు గురువారం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సోనియా గాంధీ కృతజ్ఞత సభను కూడా జర్నలిస్టులు బహిష్కరించారు.  అనంతరం ఎస్పీ కార్యాలయానికి వెళ్లి చంద్రశేఖర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.  రాజనర్సింహ సహా దాడికి పాల్పడిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సంఘాల నేతలు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. 

స్పందించిన ఎస్పీ చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  అనంతరం జిల్లా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు సంఘాల నేతలు తెలిపారు.  అందులో భాగంగానే శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, తహాసీల్దార్లకు వినతిపత్రం, 4న మండల కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు, 6న డివిజన్ కేంద్రాల్లో రాస్తారోకో కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రంగాచారితో పాటు సంఘాల నేతలు వర్ధెల్లి  వెంకటేశ్వర్లు, పరశురాం, యోగానందరెడ్డి, రవిచంద్ర, దుర్గారెడ్డి, శ్రీనివాస్, విష్ణు, వేణు, సునీల్, ప్రసన్న, అశోక్, శ్యామ్ సుందర్, పివి.రావు, శ్రీధర్‌తో పాటు  విలేకరులు, కెమెరామెన్లు పాల్గొన్నారు.

 ఖేడ్‌లో దిష్టిబొమ్మ దహనం..
నారాయణఖేడ్: దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం ఖేడ్‌లో జర్నలిస్టులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్, బసవేశ్వర చౌక్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చౌక్‌లో దిష్టిబ్మొను దహనం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్లకు వినతిపత్రం సమర్పించారు.

 రాజనర్సింహకు బాబూమోహన్ సవాల్..
జోగిపేట: దామోదర రాజనర్సింహ ...రా చూసుకుందాం...మాటలు కాదు...ఏదైనా చేతల్లోనే చూపాలని ఎమ్మెల్యే బాబూమోహన్ సవాల్ విసిరారు. గురువారం జోగిపేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రాజనర్సింహ  వ్యాఖ్యలపై  త్రీవంగా స్పందించారు. దామోదర వాఖ్యలను ఖండిస్తూ విలేకరులు చేపట్టబోయే ఏ ఉద్యమానికైనా తన మద్దతు ఉంటుందన్నారు.

 తొగుటలో దిష్టిబొమ్మ దహనం
తొగుట : విలేకరులపై జరిగిన దాడికి నిరసనగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం దామోదర రాజనర్సింహ దిష్టిబొమ్మను విలేకరులు ద హనం చేశారు.  రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో విలేకరులు బాల్‌నర్సయ్య, కిష్టాగౌడ్,  స్వామి, నర్సింలు, శ్రీకాంత్, సాయి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు