మోదీ అపాయింట్మెంట్ అడిగితే... హరిబాబు చిందులు

24 Apr, 2016 13:03 IST|Sakshi
మోదీ అపాయింట్మెంట్ అడిగితే... హరిబాబు చిందులు

విశాఖపట్నం: అఖిలపక్షంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఆదివారం న్యూఢిల్లీలో చిందులేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఫిక్స్ చేయను అని కరాఖండిగా స్పష్టం చేశారు. అయినా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినవన్నీ అమలు చేయాలని ఉందా అంటూ అఖిలపక్షంలో పాల్గొన్న ఎంపీలపై హరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆదివారం పార్లమెంట్ లైబ్రరీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలకు చెందిన లోక్సభలో ఆ పార్టీ నేతలు అయిన ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి వస్తున్న ఎంపీ హరిబాబును ఏపీ ఎంపీలు కలిశారు. రైల్వే జోన్ వ్యవహారం ఎటు తేలకుండా ఉందని... ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని... బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు అని ఈ సందర్భంగా హరిబాబుకు ఎంపీలు గుర్తు చేశారు. దీంతో ఆయన స్పందన పైవిధంగా ఉంది.

విశాఖపట్నంకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ గట్టిగా వినబడుతోంది. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లాకు అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి కించిత్ స్పందన కూడా లేదు. ఈ అంశంపై టీడీపీ నేతలు కూడా సరైన రీతిలో స్పందించడం లేదు.

మరిన్ని వార్తలు