కత్తి నరసింహారెడ్డి విజయ కేతనం

21 Mar, 2017 00:35 IST|Sakshi
కత్తి నరసింహారెడ్డి విజయ కేతనం
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, ఎస్‌ఎస్‌టీఏ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 3,763 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బచ్చలపుల్లయ్య కనీస పోటీ కూడా ఇవ్వలేక మూడో రౌండ్‌లోనే వెనుదిరిగారు. మరోవైపు పట్టభద్రుల కోటా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థుల మధ్య  పోరు నడుస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు సాగిన కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి రెండు వేల ఓట్లకుపైగా ఆధిక్యతతో ఉన్నారు. ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి.
 
మొదటి నుంచీ ‘కత్తి’కే మెజార్టీ 
ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతపురం పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి బ్యాలెట్‌బాక్సులను స్ట్రాంగ్‌రూం నుంచి తీసుకొచ్చి అభ్యర్థుల వారీగా వేరు చేశారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 18,840 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తొలి రౌండ్‌లో 14,007 ఓట్లను లెక్కించారు. ఇందులో 398 చెల్లని ఓట్లు ఉన్నాయి. వీటిని అధికారులు తొలగించారు. తక్కిన 13,609 ఓట్లలో 5,603 ఓట్ల మెజార్టీతో కత్తి నరసింహారెడ్డి ప్రథమస్థానంలో నిలిచారు. ఎస్‌ఎల్‌టీఏ (స్టేట్‌ లాంగ్వేజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌) అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులురెడ్డి 3,083 ఓట్లతో రెండోస్థానం, టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య 2,352 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
 
ఆపై రెండోరౌండ్‌లో 4,833 ఓట్లకు గాను చెల్లని ఓట్లు పోనూ 4,692 ఓట్లను లెక్కించారు. ఇందులోనూ కత్తినరసింహారెడ్డికి 1,924 ఓట్లు లభించాయి. దీంతో ఆయన మొత్తం 7,527ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. అలాగే రెండోరౌండ్‌లో ఒంటేరు శ్రీనివాసులురెడ్డికి 1,383 ఓట్లు లభించగా.. మొత్తం 4,466 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్యకు రెండో రౌండ్‌లో కేవలం 877 ఓట్లు దక్కాయి. ఈయన మొత్తం 3,229 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయినా అభ్యర్థి గెలిచేందుకు ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ (9,152 ఓట్లు) రాలేదు.
 
 దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బరిలోన ఉన్న 10 మంది అభ్యర్థులలో ప్రాధాన్యత క్రమంలో తక్కువ ఓట్లు పోలైన వారిని ఎలిమినేట్‌ చేస్తూ వారికి పోలైన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు కలుపుతూ వచ్చారు. ఈ క్రమంలో చివరగా కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు.  కత్తికి 9,624 ఓట్లు, సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 5,861 ఓట్లు లభించాయి. దీంతో కత్తి నరసింహారెడ్డి 3,763 ఓట్ల తేడాతో గెలిచారు.  
 
‘పట్టభద్రుల కోటా’లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం 
మరోవైపు పట్టభద్రుల కోటా ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. రాత్రి 8 గంటల వరకు స్ట్రాంగ్‌రూంలోని బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ సెంటర్‌లోకి తీసుకొచ్చి బ్యాలెట్‌పత్రాలను అభ్యర్థుల వారీగా వేరుచేసే ప్రక్రియే కొనసాగింది. దీంతో 8 తర్వాత తొలిరౌండ్‌ ఓట్లను లెక్కించారు. నియోజకవర్గ పరిధిలో 2,49,582 ఓట్లకు గాను 1,55,536 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లను 26వేల చొప్పున వి¿భజించి ఆరు రౌండ్లుగా ఓట్ల లెక్కింపు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిరౌండ్‌ ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిపై 2,133 ఓట్ల ఆధిక్యత సాధించారు. గోపాల్‌రెడ్డికి 8,648 ఓట్లు పోలవ్వగా, కేజేరెడ్డికి 6,515 ఓట్లు పోలయ్యాయి. గేయానంద్‌ మూడోస్థానంలో ఉన్నారు. ఆయనకు 5,316 ఓట్లు లభించాయి. ఇంకా ఐదురౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలివుంది. తుది ఫలితం రావాలంటే మంగళవారం సాయంత్రం వరకు ఆగాల్సి ఉంటుందని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. ఫలితాల కోసం వైఎస్సార్‌సీపీతో పాటు టీడీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థులు రాత్రంతా కౌంటింగ్‌ కేంద్రం వద్ద జాగారణ చేశారు.  
>
మరిన్ని వార్తలు