జిల్లా ఆస్పత్రిలో మోడల్‌ లేబర్‌ రూం

24 Aug, 2016 20:02 IST|Sakshi
జిల్లా ఆస్పత్రిలో మోడల్‌ లేబర్‌ రూం

ప్రొద్దుటూరు క్రైం:
 జిల్లా ఆస్పత్రిలో మోడల్‌ లేబర్‌ రూం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించడానికి బుధవారం యూనిసెఫ్‌ ప్రతినిధులు ప్రొద్దుటూరుకు వచ్చారు. యూనిసెఫ్‌ ప్రతినిధులు అభిషేక్, నితీష్‌లు ఆస్పత్రికి విచ్చేసి వసతులను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మాతా శిశుమరణాలను తగ్గించేందుకు మోడల్‌ లేబర్‌ రూంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ఆస్పత్రుల్లో ఉన్న వసతులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. జిల్లాలో ప్రొద్దుటూరుతోపాటు రాజంపేట, రిమ్స్‌ ఆస్పత్రులను పరిశీలించామని చెప్పారు.

మోడల్‌ లేబర్‌ రూంలలో సుమారు రూ. 2 లక్షలు విలువ చేసే బెడ్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. ప్రసవం అనంతరం సుమారు 8 గంటల పాటు తల్లి, బిడ్డ ఇందులోనే విశ్రాంతి తీసుకుంటారని పేర్కొన్నారు. అంతేగాక ఇందులో భాగంగానే కంగారు మదర్‌ కేర్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడి నుంచి కొన్ని కేసులను కడపకు తీసుకొని వెళ్లాల్సి వస్తోందని, దారిలో ఏదైనా జరిగి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వారు అభిప్రాయ పడ్డారు. అందువల్ల ఇక్కడ మోడల్‌ లేబర్‌ రూం అవసరమని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.  రాష్ట్రంలో మొదట కడప జిల్లాలోనే సర్వే చేస్తున్నామని తెలిపారు. సూపరింటెండెంట్‌ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో మోడల్‌ లేబర్‌ రూం చాలా అవసరమన్నారు. ప్రభుత్వం దీన్ని మంజూరు చేస్తే గర్భిణులకు ఇంకా మంచి వైద్యం అందుతుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు