గోదారి తీరం కన్నీటి రాగం

12 Dec, 2016 14:54 IST|Sakshi
గోదారి తీరం కన్నీటి రాగం
సంగీత సామ్రాజ్య సార్వభౌమ, పద్మవిభూషణ్, ఫ్రెంచ్‌        శెవాలియర్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ మంగళంపల్లి బాల      మురళీకృష్ణ మృతితో సంగీతాభిమానులు  శోకసాగరంలో మునిగిపోయారు. గోదారమ్మ ఒడిలో కనులు తెరిచిన  బాలమురళి భారతీయ శాస్రీ్తయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సంగీత ప్రపంచ  మేరునగ ధీరుడు. తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంతో ఆయనకు విడదీయరాని  అనుబంధం ఉంది. త్యాగరాజ నారాయణదాస సేవా సమితికి స్థలం కేటాయింపునకు ఆయన విశేష కృషి చేశారు. నేటికీ ఆయన గోదావరి గట్టున ఉన్న  త్యాగరాజ           నారాయణదాస సేవాసమితి నిధికి శాశ్వత సభ్యుడు. 2003 పుష్కరాలలో ఆయన నగరానికి వచ్చి, అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2012లో  శారదానగర్‌లోని ఒక పార్కుకు నగర పాలక సంస్థ ఆయన పేరుపెట్టింది.             ఆ కార్యక్రమానికి ఆయన వ్యక్తిగతంగా హాజరు                కాలేకపోయినా,  నాటి మునిసిపల్‌ కమిషనర్‌కు ఫోను ద్వారా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. 
– రాజమహేంద్రవరం కల్చరల్‌
సంగీత సభ ఏర్పాటు
రాజమహేంద్రవరానికి చెందిన బాలమురళి వీరాభిమాని సాగి శ్రీరామచంద్రమూర్తి 1995లో డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట సంగీత సభను నెలకొల్పారు. ఏటా ఆయన పుట్టిన రోజున సంగీత సభలు నిర్వహించడం, సంగీత కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన పుట్టిన రోజున గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయేశ్వరస్వామి ఆలయంలో బాలమురళి పేరిట పూజలు చేసి, ప్రసాదాన్ని ఆయనకు పంపేవారు. ఆయన మరణ వార్తవిని నగర ,ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. 
ఏటా ఆయన పుట్టినరోజు నిర్వహిస్తున్నా
డాక్టర్‌ బాలమురళీకృష్ణ సభ ఆధ్వర్యంలో 1995 నుంచి ఎందరో పెద్దల సహకారంతో క్రమం తప్పకుండా ఏటా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాను. నా మనుమడికి ఆయన పేరే పెట్టుకున్నాను.  ఇక్కడ నిర్వహించే ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వస్తానని చెప్పారు. ఆ మంచి రోజు రాకుండానే ఆయన కన్నుమూయడం బాధాకరం.
– సాగి శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్‌ మంగళంపల్లి 
బాలమురళీకృష్ణ సంగీత సభ వ్యవస్థాపక కార్యదర్శి, రాజమహేంద్రవరం
తొలి సంగీత కచేరీ కాకినాడలోనే..
కాకినాడ కల్చరల్‌ : ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాల మురళీకృష్ణకు కాకినాడ నగరంతో మంచి అనుబంధం ఉంది. బాలమురళి ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో ఆయన తొలి సంగీత కచేరీ సూర్యకళా మందిర్‌లోనే నిర్వహించారు. అభ్యుదయ ఫౌండేషన్‌  5 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సూర్యకళా మందిర్‌లో 2013 జనవరి 13న నిర్వహించిన అభ్యుదయ సంప్రదాయ సాంస్కృతిక వైభవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంగీత కచేరీ నిర్వహించి సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధులను చేశారు. సూర్యకళా మందిరం శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని 2004 అక్టోబర్‌లో భవనాన్ని ఆధునికీకరించారు. ఈ భవనాన్ని బాలమురళీకృష్ణ ప్రారంభించారు. కాకినాడలోని సంగీత విద్వాంసులు మునిగంటి వెంకట్రావు, డాక్టర్‌ ఇ.వి.కృష్ణమాచార్యులు, పెద్దాడ సూర్యకుమారిలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.  
రాజమహేంద్రవరంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తా   
కొత్తపేట : ప్రముఖ సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, నేపథ్య గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి తీరని లోటని ప్రముఖ శిల్పి, ఉభయ గోదావరి జిల్లాల సంగీత, వాయిద్య, నృత్య కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌ నివాళులర్పించారు.  మంగళంపల్లి మృతి చెందారన్న వార్త తెలిసి రాజ్‌కుమార్‌ కన్నీటి పర్యంతమయ్యారు. వివిధ సందర్భాల్లో బాలమురళీకృష్ణతో మంచి పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి తాను రూపొందించిన పలు విగ్రహాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆవిష్కరించినప్పుడు ఆయన తనకు ఫోన్‌  చేసి అభినందించేవారన్నారు. రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని తన వుడయార్‌ ఫై¯న్‌  ఆర్ట్స్‌ గ్యాలరీ వద్ద మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఉన్న పార్కులో ఆయన జయంతి      సందర్భంగా వచ్చే ఏడాది జూలై 6న మంగళంపల్లి విగ్రహాన్ని నెలకొల్పుతానని రాజ్‌కుమార్‌ తెలిపారు.  
– ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌వుడయార్‌
 
 
 
మరిన్ని వార్తలు