అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

6 Jun, 2016 02:32 IST|Sakshi
అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

తలకు గాయం.. తీవ్ర రక్తస్రావం
ఉరి వేసుకుందని ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త

 మెదక్‌రూరల్: అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలైన సంఘటన మండలం అవుసులపల్లి గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం...అవుసులపల్లి గ్రామానికి చెందిన యాదాగౌడ్-కమలమ్మల మొదటి సంతానం స్వాతి(25)ని ఇదే గ్రామంలోని మిన్‌పూర్ బాలాగౌడ్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి 8 ఏళ్లలోపు ఇద్దరు సంతానం ఉన్నారు. పెళ్లి సమయంలో బాలాగౌడ్‌కు కట్నకానుకలు ఘనంగా సమర్పించారు. అయితే మూడు నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ బాలాగౌడ్ స్వాతిని హింసిస్తున్నాడు.

ఈ క్రమంలో స్వాతి తల్లిదండ్రులు ఇటీవల  బాలాగౌడ్‌కు రూ. 20 వేలు ముట్టజెప్పారు. అయినప్పటికీ అత్యాశకు పోయిన బాలాగౌడ్ మరింత కట్నం తీసుకురావాలంటూ శనివారం రాత్రి సైతం వేధించడంతో స్వాతి అదే గ్రామంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి విషయం తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి భర్త ఇంటికి పంపించారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రి 10 గంటల సమయంలో ‘మీ కూతురు ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకుంది. తీయడం లేద’ంటూ ఆమె భర్త స్వాతి తల్లిదండ్రుల వద్దకు వచ్చి చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి తలుపులు తీసి చూడగా స్వాతి ఉరి వేసుకొని ఉంది.

ఆమెను కిందకు దించి చూడగా స్వాతి తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైనట్లు గుర్తించారు. దీంతో బాలాగౌడ్ తమ బిడ్డను గోడకు కొట్టి చంపేసి, ఉరి వేశాడని స్వాతి తల్లిదండ్రులు ఆరోపిస్తూ మెదక్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు