అర్ధరాత్రి మృత్యుఘోష

23 Aug, 2016 03:08 IST|Sakshi
అర్ధరాత్రి మృత్యుఘోష

ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 10 మంది మృతి
 
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం/కూసుమంచి: సమయం.. అర్ధరాత్రి 2.40 గంటలు.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.. బస్సు వేగంగా పోతోంది.. ఇంతలో ఊహిం చని ఉత్పాతం.. రోడ్డుపై ఆగివున్న బస్సును తప్పించబోయే క్రమంలో ఘోర ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి 25 అడుగుల లోతు కాల్వలో బస్సు పడిపోయింది.. ప్రయాణికులు తేరుకునేలోపే బస్సులోకి నీరు చేరింది.. తీవ్రగాయాలతో కొందరు.. ఊపిరాడక మరికొందరు.. మొత్తంగా పది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి!! సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు తూర్పుగోదావరి జిల్లా, ముగ్గురు పశ్చిమగోదావరి జిల్లా, ఒకరు ప్రకాశం జిల్లాకు చెందినవారు. మిగతా ఇద్దరిలో ఒకరు కరీంనగర్‌కు, మరొకరు హైదరాబాద్‌కు చెందినవారు. ప్రమాదంలో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒక డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

 ప్రమాదం జరిగింది ఇలా..!
 ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్‌లోని మియాపూర్ నుంచి ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా 31 మంది ప్రయాణికులతో నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రాజీని ప్రైవేటు టూరిస్టు బస్సు(ఏపీ 26 టీసీ 9512) ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు బయల్దేరింది. సూర్యాపేటకు చేరుకున్న తర్వాత టీ కోసం కాసేపు బస్సు ఆపారు. వాస్తవానికి బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే మీదుగా కాకినాడ వెళ్లాలి. కానీ అటువైపు పుష్కర యాత్రికులతో రద్దీగా ఉండటంతో.. ఖమ్మం, తల్లాడ మీదుగా విజయవాడ వెళ్లేందుకు బస్సును ఖమ్మం వైపు మళ్లించారు. సూర్యాపేట వరకు డ్రైవింగ్ చేసిన శ్రీను విశ్రాంతి తీసుకోగా.. అక్కడ్నుంచి కిషోర్ డ్రైవింగ్ చేశాడు. సూర్యాపేట నుంచి ఖమ్మం వస్తున్న బస్సు అర్ధరాత్రి 2.40 గంటల సమయంలో కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం వద్దకు చేరింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫాల్ రెగ్యులేటరీ గేట్ల బ్రిడ్జి వద్దకు వేగంగా దూసుకొచ్చింది. ఇక్కడ అప్పటికే ఓ ప్రమాదం జరిగి, రెండు బస్సులు ఢీకొన్నాయి. అందులో ఒక బస్సు రోడ్డుపై ఆగి ఉంది. ఆ బస్సును తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి సుమారు 25 అడుగుల లోతున్న కాల్వలోకి పడిపోయింది.

 క్రేన్ల సాయంతో బయటకు తీసి..
 బస్సు కాల్వలోకి పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు బ్రిడ్జి వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. కాల్వలోని గేట్ల వద్ద నాలుగు అడుగుల మేర నీరుంది. బోల్తాపడిన బస్సులోకి క్రమంగా నీళ్లు వచ్చాయి. ఏసీ బస్సు కావడం.. అద్దాలన్నీ మూసుకుని ఉండటంతో ప్రయాణికులు బయటకు రావడం కష్టమైంది. కొందరు ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోవడం, వారిపై లగేజీ పడడంతో బస్సులోనే చాలామంది ఉండిపోయారు. స్థానికులతోపాటు కొందరు మత్స్యకారులు  చీకట్లో సెల్‌ఫోన్ లైట్లు వేసుకుని  బస్సు అద్దాలు పగులగొట్టి కొందరిని బయటకు తీశారు. అప్పటికే ఐదుగురు చనిపోయారు. ఉదయం వరకు బస్సులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసే పరిస్థితి లేకపోవడంతో 8 గంటల సమయంలో రెండు భారీ క్రేన్లను తెప్పించారు. బస్సును తాళ్లతో కట్టి బయటకు తీశారు. బస్సులో ఇరుక్కుని బయటకు వేలాడుతున్న మృతదేహాలు పలుమార్లు బ్రిడ్జి పిల్లర్లకు తగలడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది.  

 డ్రైవర్‌పై కేసు..
 బస్సు ప్రమాద ఘటనపై కూసుమంచి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బస్సును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపినందుకు బస్సు డ్రైవర్ కిషోర్‌పై కేసులు నమోదు చేసినట్లు సీఐ కిరణ్‌కుమార్ తెలిపారు. కాగా ఈ ఘటనపై విచారణాధికారిగా డీఎస్పీ సురేష్ కుమార్ వ్యవహరిస్తారన్నారు.
 
 ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
 ఖమ్మం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల సమాచారాన్ని వారి కుటుంబీకులకు చేరవేయడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
 
 పని కోసం వెళ్తూ..
 ప్రమాదంలో కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన అశోక్ చనిపోయాడు. అనువాల కాంతయ్య-పద్మల రెండో కుమారుడైన ఈయన బీటెక్ పూర్తి చేశాడు. తండ్రి వెల్డర్‌గా పనిచేస్తుండగా, ఆయన వద్ద పని నేర్చుకున్నాడు. కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో చేరేందుకు వెళ్తూ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు.
 
 ఏఎస్సై కుమారుడు..
 బస్సు ప్రమాదంలో మరణించిన అజారుద్దీన్‌ది ప్రకాశం జిల్లా మార్కాపురం. ఈయన తండ్రి షేక్ రఫీవుద్దీన్ యర్రగొండపాలెం ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు అజారుద్దీన్.. కాకినాడ జేఎన్‌టీయూలో ఎంటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఎదిగిన కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు.
 
 మృతుల వివరాలు

 1. వాసంశెట్టి దుర్గాశ్రావణి (19)
 చింతాకులవారిపేట, తాళ్లరేవు,  తూర్పుగోదావరి జిల్లా
 2. ఎస్.కె.అజారుద్దీన్ (22)
 మార్కాపురం, ప్రకాశం జిల్లా
 3. తోకల సత్య ప్రశాంత్ (22) పూళ్లవారి వీధి, కాకినాడ,
 తూర్పుగోదావరి
 4. జ్ఞాన సుమంత్ సాయి (25) బండవారి వీధి, వేల్పూరు,
 పశ్చిమగోదావరి జిల్లా
 5. ఆల్వాల అశోక్ (25) మేడేపల్లి కాలని, జ్యోతినగర్, రామగుండం, కరీంనగర్ జిల్లా
 6. పట్నాల రమేష్ పసలపూడి,  తూర్పుగోదావరి జిల్లా
 7. కొత్తల వెంకట త్రినాథ దుర్గారావు (41)ఉంగుటూరు,
 పశ్చిమగోదావరి జిల్లా
 8. చిన్నవెంకట సుబ్బారెడ్డి (50) భరత్‌నగర్, హైదరాబాద్
 9. టేకు వరలక్ష్మి (50) మలిశాల గ్రామం,  తూర్పుగోదావరి జిల్లా
 10. పెద్దిరాజు (28) నిడమర్రు,  పశ్చిమగోదావరి జిల్లా
 
 అయ్యో.. అలా వెళ్తే బతికేవారేమో?
 ఖమ్మం: హైదరాబాద్-కాకినాడ వెళ్లే బస్సులు సాధారణంగా సూర్యాపేట, కోదాడ, విజయవాడ మీదుగా కాకినాడ వెళ్తాయి. కానీ డ్రైవర్ ఈ మార్గంలో కాకుండా బస్సును వేరే దారిలోకి మళ్లించాడు. కృష్ణా పుష్కరాలు కావడం, ట్రాఫిక్ జామ్ కావడంతో డ్రైవర్ సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా కాకినాడ వెళ్లాలని భావించాడు. ఈ రూట్‌పై పెద్దగా అవగాహన లేకపోవడంతోపాటు నాయకన్‌గూడెం వద్ద ఉన్న మూల మలుపును డ్రైవర్ గుర్తించలేదు. ఇక్కడ అప్పటికే మరో బస్ ఆగిపోవడంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వంతెన రెయిలింగ్‌ను ఢీకొని బస్సు కాల్వలో పడింది. ఆలస్యమైనా విజయవాడ మీదుగా వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని మృతుల బంధువులు రోదిస్తున్నారు.
 
 కళ్లు తెరవని అధికారులు
 తరచూ ఇక్కడే ప్రమాదాలు.. అయినా పట్టించుకోని వైనం
  కూసుమంచి: అధికారుల నిర్లక్ష్యం.. అలసత్వంతో ప్రయాణికుల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రస్తు తం బస్సు ప్రమాదం జరిగిన సాగర్ ఇన్‌ఫాల్ కాల్వ రెగ్యులేటర్ గేట్ల వద్ద తరచూ దుర్ఘటనలు జరుగుతున్నా అధికారులు కళ్లు తెరవడంలేదు. 2 నెలల క్రితం మణుగూరు డిపోకు చెం దిన ఆర్టీసీ బస్సు ఇక్కడే కాల్వలో పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతిచెందగా.. పది మందికి పైగా గాయాలపాలయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు కాల్వలో పడింది. సూ ర్యాపేట-ఖమ్మం రహదారి మలుపులతో ప్రమాదకరంగా ఉంది.

నాయకన్‌గూడెం నుంచి పాలేరు వరకు రహదారి మృత్యుకుహరంగా మారింది. నాయకన్‌గూడెం వద్ద పాలేరు రిజర్వాయర్‌కు వచ్చే ఇన్‌ఫాల్ కాల్వపై ఉన్న వంతెన ఇరుకుగా ఉండటం.. పై భాగాన రోడ్డు ముందు వచ్చే వాహనాలు కనిపించని విధంగా మూలమలుపులు ఉండటంతో తర చు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటు పాలేరు ఔట్‌ఫాల్ కాల్వపై ఉన్న వంతెనకు రెయిలింగ్ పూర్తిస్థాయిలో లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నప్పుడు ప్రమా దం జరిగితే వాహనాల అడ్రస్ దొరకని పరిస్థితి. సమీపంలోనే ఉన్న మినీ హైడల్ విద్యుత్ ప్రాజెక్టు కాల్వ కూడా ప్రమాదకరంగా మారింది. గతంలో ఓ డీసీఎం,కారు కాల్వలోకి దూసుకెళ్లగా.. పలువురు మృత్యువాత పడ్డారు. 

మరిన్ని వార్తలు