నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..

16 May, 2017 23:40 IST|Sakshi
నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..

కుమారుడిని చూసి ఆనందబాష్పాలు రాల్చిన తల్లిదండ్రులు
గుత్తి : చదువు మీద ఇష్టం లేక హాస్టల్‌ నుంచి పారిపోయిన ఓ బాలుడు పోలీసుల చొరవతో నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరిన సంఘటన గుత్తిలో మంగళవారం చోటు చేసుకుంది.  వివరాలు.. గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ, సువర్ణ దంపతుల కుమారుడు రమేష్‌ గుత్తిలోని నంబర్‌–3 హాస్టల్లో 4వ తరగతి చదువుతూ ఉండేవాడు. ఈ క్రమంలో చదువు మీద ఇష్టం లేక 2013, మే 5న హాస్టల్‌ నుంచి పారిపోయి గుంటూరు చేరాడు. గుంటూరులో తన పెద్దమ్మ గాయత్రి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అడ్రస్‌ తెలియకపోవడంతో గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లాడు.

అక్కడ ఏంచేయాలో తెలియక రోడ్డుపై తిరుగుతుండేవాడు. ఒక రోజు ఎస్‌కేసీవీ చిల్డ్రెన్‌ ట్రస్ట్‌ సభ్యులు ఆ బాలున్ని గమనించారు. దగ్గరకు తీసుకుని ఆరా తీశారు. తనకు ఎవరూ లేరని, అనాథనని చెప్పాడు. దీంతో ట్రస్ట్‌ సభ్యులు బాలుడిని గాంధీ నగర్‌లో ఉన్న అనాథ ఆశ్రమంలో చేర్పించి చదివించారు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేసుకున్నాడు. అయితే ఏ కారణం చేతనో బాలుడికి తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. వెంటనే అనాథ ఆశ్రమం వారిని కలిసి తాను అనాథను కాదని, తల్లిదండ్రులు గుంతకల్లులో ఉన్నారని చెప్పాడు. దీంతో అనాథ ఆశ్రమం, ట్రస్ట్‌ సభ్యులు ఈ విషయాన్ని గుంతకల్లు పోలీసులకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. అయితే వారు స్పందించలేదు. దీంతో  గుత్తి ఎస్‌ఐ చాంద్‌ బాషాకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి ఆ బాలున్ని గుత్తికి రప్పించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆ బాలున్ని  తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారున్ని నాలుగేళ్ల తర్వాత  చూడటంతో తల్లిదండ్రులు సంతోషంతో తబ్బిబ్బైయ్యారు. చొరవ చూపి తమ కుమారున్ని అప్పగించిన ఎస్‌ఐ చాంద్‌బాషాకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు