తల్లి ఒడి చేరిన చెన్నకేశవుడు

2 Jul, 2017 00:00 IST|Sakshi
తల్లి ఒడి చేరిన చెన్నకేశవుడు
  • టెక్నాలజీ, పోలీసుల కృషితో దొరికిన కిడ్నాపర్లు
  •  వివాహేతర సంబంధాన్ని నిలుపుకునేందుకే బాలుడి కిడ్నాప్‌
  •  అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు
  • తిరుపతి క్రైం: ఈ నెల 14న తిరుమల శ్రీవారి ఆలయం ముందు గొల్లమండపం వద్ద కిడ్నాప్‌నకు గురైన చిన్నారి చెన్నకేశవులును డీఐజీ ‍ప్రభాకర్‌రావు శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఆయన అర్బన్‌ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడు నామక్కల్‌ జిల్లా రాసిపురం తాలూకా సింగనందాపురం గ్రామం మెల్‌కొత్తూరుకు చెందిన ఎం. అశోక్‌ (24)కు, అదే జిల్లాలోని శాంతిమంగళం తాలూకా మల్లెవేపగుంటకు చెందిన పెరీస్వామి భార్య తంగే (24)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2015లో తంగే భర్తతో గొడవపడి అశోక్‌తో పాటు బెంగళూరుకు వెళ్లిపోయింది. గత నెల 10వ తేదీ రాత్రి ఇద్దరు రైలు ఎక్కి తిరుపతికి వచ్చారు.
    శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. 14వ తేదీన ఉదయం 5.45 నిమిషాలకు గొల్లమండపం వద్ద చెన్నకేశవులును కిడా‍్నప్‌ చేసి బస్సులో తిరుపతికి వచ్చి ప్రైవేటు ద్వారా బెంగళూరు వెళ్లిపోయారు. వారం రోజులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అశోక్‌ తన తండ్రికి ఫోన్‌ చేసి తమకు మగబిడ్డ పుట్టాడని తెలిపాడు. వారి పిలుపు మేరకు సొంత ఊరుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చిన్నారి కిడ్నాప్‌పై పోలీసులు విస్తృతంగా ప్రకటనలు చేయడంతో ఆ విషయం గ్రామస్తులకు తెలిసింది. వారు భయపడి శుక్రవారం నామక్కల్‌ జిల్లా మేల్‌కుర్చి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. అక్కడి పోలీసులు అర్బన్‌ జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఎస్వీ యూనివర్సిటీ సీఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని బాబును, నిందితుల్ని తిరుపతికి తీసుకువచ్చారు.

     

    వివాహేతర సంబంధాన్ని నిలుపుకునేందుకే..

    ఇద్దరు నిందితులు తమ వివాహేతర సంబంంధాన్ని నిలుపుకోవడంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు లేకుండా కలుగకుండా ఉండేందుకు పన్నాగం పన్నారు. తమకు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుంటారని, గ్రామస్తులు కూడా ఏమీ చేయరని భావించారు. పిల్లల కోసం అనాథాశ్రమాల్లో ప్రయత్నించారు. అక్కడ కుదరకపోవడంతో తిరుమలకు చేరుకుని బాలుడిని కిడ్నాప్‌ చేశారు. చిన్నారికి తల్లిపాలు ఇవ్వకపోవడం, తంగే ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడం, వాట్సాప్, పేస్‌బుక్‌లో వీరి చిత్రాలు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానించి హెచ్చరించారు.

    దీంతో వారు చేసేది లేక పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ కేసును ఛేదించడంలో ఏఎస్పీ మురళీకృష్ణ, డీఎస్పీలు మునిరామయ్య, కొండారెడ్డి, సుధాకర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, తులసీరామ్, వెంకటరవి, శరత్‌చంద్ర, భాస్కర్, సత్యనారాయణ, రామకృష్ణ, సిబ్బంది ఎంతగానో కృషి చేశారని డీఐజీ తెలిపారు. అదేవిధంగా సీసీ టీవీల కమాండెంట్‌ కంట్రోల్‌ రూమ్‌లు నిరంతరం కష్టపడడం వల్లే కిడ్నాప్‌ కేసును ఛేదించామన్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ప్రతి ఒక్కరికీ డీజీపీ సాంబశివరావు ప్రత్యేక అభినందనలు తెలిపినట్టు డీఐజీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు