'హెల్మెట్ ఉంటేనే పెట్రోల్'

24 May, 2016 17:54 IST|Sakshi

ఆదిలాబాద్ : రోడ్డు భద్రత దృష్ట్యా ద్విచక్ర వాహనదారులకు జూన్ 2 నుంచి హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని పెట్రోల్ కంపెనీ డీలర్లను ఆర్డీఓ సుధాకర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన చాంబర్‌లో పెట్రోల్ కంపెనీ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌తో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రతి వంద ప్రమాదాల్లో 70 శాతం ద్విచక్ర వాహనదారులు తలకు తీవ్ర గాయమై మృతిచెందుతున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలకు గురైనా మృత్యు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఈ దృష్ట్యా జిల్లాలో ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. డీటీసీ పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ పెట్రోల్ బంక్‌ల వద్ద బ్యానర్లు ప్రదర్శించి, వినియోగదారులను అవగాహన పర్చాలని సూచించారు. రవాణ శాఖ ఇన్స్‌పెక్టర్లు పెట్రోల్‌బంక్‌ల వద్ద వినియోగదారులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ జిల్లా కలెక్టర్ ఈ ప్రయోగాన్ని అమలు చేసి విజయవంతం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంవీఐ కిషోర్‌చంద్ర రెడ్డి, పెట్రోల్‌బంక్ డీలర్లు మౌనిష్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు