18న జగన్ రాక

16 Jul, 2016 01:40 IST|Sakshi
18న జగన్ రాక

తుని : విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 18వ తేదీన రానున్నారని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తెలిపారు. శుక్రవారం సాయంత్రం తుని శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయానికి  వచ్చిన విశాఖ నాయకులను, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజులను రాజా సాదరంగా ఆహ్వానించారు. 18న జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్‌పై చర్చించారు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు ఉదయం పది గంటలకు వస్తారని, మాకవరపాలెంలో జరిగే గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.  రోడ్డు మార్గంలో సాయంత్రం మూడు గంటలకు తుని చేరుకుంటారని, జాతీయ రహదారి తాండవ బ్రిడ్జి వద్ధ తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన నాయకులు ఘనస్వాగతం పలుకుతారన్నారు. ప్లైవోవర్, జీఎన్‌టీ రోడ్డు, పట్టణ పోలీస్ స్టేషన్ మీదుగా వీరవరపుపేట చేరుకుంటారు.

అక్కడి నుంచి బయలుదేరి పాయకరావుపేట మండలం శ్రీరాంపురం మీదుగా పాల్మన్‌పేట వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారన్నారు. తునిలో స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజా తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గం సమన్వయకర్త చిక్కాల రామారావు, ధనిశెట్టి బాబూరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వేంకటేష్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు