‘మండవ’కే విజయ డెయిరీ పగ్గాలు

21 Sep, 2016 08:19 IST|Sakshi
‘మండవ’కే విజయ డెయిరీ పగ్గాలు
  • నిర్ణయించిన సీఎం
  • నేడు ఎన్నిక లాంఛనం
  • విజయవాడ : కృష్ణా మిల్క్‌ యూనియన్‌(విజయ డెయిరీ) చైర్మన్‌ పదవిని మళ్లీ మండవ జానకిరామయ్యకే అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నగరంలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి సమక్షంలో విజయ డెయిరీ చైర్మన్‌ నియామకంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత చైర్మన్‌ మండవ జానకిరామయ్యతోపాటు 14 మంది పాలకవర్గ డైరెక్టర్లు, పలువురు మంత్రులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గంటన్నర చర్చల అనంతరం మళ్లీ మండవ జానకిరామయ్యకే విజయ డెయిరీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. బుధవారం జరిగే ఎన్నికల్లో మండవను చైర్మన్‌గా ఎన్నుకోవాలని డైరెక్లర్లను సీఎం ఆదేశించారు. 
     
    వేర్వేరుగా భేటీలు.. 
    ముందుగా పాలకవర్గ డైరెక్టర్లతో సీఎం భేటీ అయ్యారు. ఆ తర్వాత జానకిరామయ్యతో సుమారు అర్ధగంట ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం జిల్లా మంత్రులు, నాయకులతోనూ చర్చించారు. మండవ ప్రత్యర్థులు ఆయన్ను వ్యతిరేకించారు. అయితే 24 ఏళ్లు ఆ పదవిలో ఉన్న మండవకు మరో ఏడాది చైర్మన్‌ పదవి అప్పగించాలని మెజార్టీ పాలకవర్గ సభ్యులు సూచించారు. ఈ క్రమంలో సీఎం కూడా మండవకు మద్దతు తెలిపారు. 
     
    ఏడాది మాత్రమే మండవకు పదవి ! 
    మండవ జానకిరామయ్యకు ఏడాది మాత్రమే చైర్మన్‌ పదవి ఇవ్వాలని లోపాయికారి ఒప్పందం కుదరిందని సమాచారం. ఏడాది తర్వాత చైర్మన్‌ నియామకంపై చర్చిద్దామని మంత్రులకు సీఎం చెప్పినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నించిన చలసాని ఆంజనేయులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు