సా...గుతున్న విచారణ

3 Mar, 2017 22:46 IST|Sakshi
సా...గుతున్న విచారణ

అక్రమంగా విత్తనాలు నిల్వ చేసిన వారిపై చర్యలేవీ ?
కేసును పోలీసులకు అప్పగించామంటున్న వ్యవసాయ శాఖ అధికారులు
మరికొందరు అక్రమార్కులకు ఊతంగా అధికారుల వైఖరి


వరంగల్‌ రూరల్‌ : వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన వరంగల్‌ రూరల్‌ జిల్లాలో రైతన్నలు దగా పడుతూనే ఉన్నారు. నకిలీ విత్తనాలు, అక్రమ నిల్వలతో రైతులను మోసం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మోసం చేసేందుకు మరికొందరికి అవకాశం దక్కుతోంది. గడిచిన సీజన్‌లో వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన సుమారు 1400మంది రైతులు నకిలీ మిర్చి విత్తనాల కారణంగా దగా పడ్డారు. వీరికి ఇప్పటికీ న్యాయం జరగకపోగా.. యాసంగికి రైతులు సిద్ధమవుతున్న  సమయంలో గత ఏడాది డిసెంబర్‌ 17న నర్సంపేటలోని ఎంజేఆర్‌ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 675బస్తాల వరి విత్తనాలు వ్యవసాయ శాఖ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ఊరుపేరు లేని విత్తనాలు తెచ్చినట్లు తేలినా కేవలం పోలీసులకు అప్పగించి చేతులు దులుపుక్ను వ్యవసాయ అధికారులు మళ్లీ దృష్టి పెట్టకపోవడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఏ కంపెనీవో..
నర్సంపేట ఎంజేఆర్‌ మిల్లులో 675బస్తాల వరి విత్తనాలు నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పరిశీలనలో బస్తాలపై లేబుళ్లు, ట్యాగ్స్‌ లేకపోగా.. విత్తనాలకు సంబంధించిన అనుమతులు సైతం లేనట్లు తేలింది. విత్తనాల వివరాలు లేకపోవడంతో అవి సరైనవే అయినా రైతులకు నష్టం జరిగితే ఎవరిది బాధ్యత అనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల నిల్వలను పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఇలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవరమైతే పీడీ చట్టం కింద కేసులు పెడతామని జిల్లా వ్యవసాయ అధికారి ఉష స్పష్టం చేశారు. కానీ బాధ్యులపై సాధారణ కేసు పెట్టి విచారణను ఇప్పటి వరకు సాగదీస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. రైతులను మోసం చేసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరికొందరు ఇలాగే వ్యవహరించే అవకాశముంది. అయినా అధికారులు ఈ దిశగా దృష్టి సారించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు