ఇతర కులాలను చేర్చితే బీసీలకు అన్యాయమే

27 Jul, 2016 00:04 IST|Sakshi
బీసీ ఐక్య వేదిక కన్వీనర్‌ చిట్టబ్బాయి
అమలాపురం రూరల్‌ :  ఇతర కులాలను చేర్చితే బీసీలు రాజకీయంగా రిజర్వేషన్లు కోల్పోతారని జిల్లా బీసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్, వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యుడు  కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. అమలాపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 22న విజయవాడలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథ్‌ను కలిసి జిల్లా బీసీ సంఘాల తరపున సమస్యలు, వినతులు ఇచ్చామని చెప్పారు. అభివృద్ధి చెందిన ఇతర కులాలను బీసీల్లో చేర్చటం వల్ల తమ రిజర్వేషన్లకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా పలు పదవులు కోల్పోతామని కమిషన్‌కు వివరించామన్నారు. ప్రభుత్వం బీసీ సంఘాల సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు బడ్జెట్‌ రూ.వెయ్యి కోట్లు కేటాయించి రూ.రెండు లక్షల వరకూ హామీ లేకుండా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. బీసీలకు రూ.50 వేల రుణాలకు కూడా బ్యాంకుల్లో హామీలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తులకు రూ.అయిదు లక్షల వరకూ హామీ లేకుండా రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొన్ని సామాజిక వర్గాల మాదిరిగా తామేమీ విధ్వంసాలకు పాల్పడలేదని... అలా చేస్తే ప్రభుత్వం దిగి వస్తుందా..? అని ప్రశ్నించారు. జిల్లా  బీసీ సంఘాల అధ్యక్షుడు పంపన రామకృష్ణ మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చటం వల్ల బీసీలు వార్డు మెంబరుగా కూడా గెలవరని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో కాపులను చేర్చవద్దని తాము కమిషన్‌కు చెప్పామని స్పష్టం చేశారు. 
 
>
మరిన్ని వార్తలు