పాపిడి.. ఉపాధి జడి

24 Oct, 2016 19:25 IST|Sakshi
పాపిడి.. ఉపాధి జడి
–పాలకొల్లు సోం పాపిడికి ఖండాంతర ఖ్యాతి
–50 ఏళ్లుగా 20 కుటుంబాలు తయారీ
–సంప్రదాయ పద్ధతిలోనేవంటకం  
 
పాపిడి పేరు చెప్పగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరి నోరూరుతుంది. వీధుల్లో పాపిడి బండి గంట శబ్ధం వినిపించగానే చిన్నారులు రుచి చూసేందుకు పరుగులు తీస్తుంటారు. కొని ఇవ్వకపోతే మారాం చేస్తుంటారు. ఇందులో పాలకొల్లు సోం పాపిడి రుచే వేరు. సంప్రదాయ పద్ధతిలో చేస్తున్న ఈ వంటకం ఖండాంతరాల్లో ఖ్యాతి గడించింది. పాలకొల్లు గుత్తులవారిపేటకు చెందిన సుమారు 20 కుటుంబాలు వంశపారంపర్యంగా 50 ఏళ్లుగా సోం పాపిడి తయారీతో ఉపాధి పొందుతున్నారు. – పాలకొల్లు టౌన్‌
 
పుల్లల పొయ్యిపై తయారీ
పాలకొల్లు సోం పాపిడి దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అమెరికా, కువైట్, దుబాయ్, ఐరోపా దేశాల్లో తెలుగువారి మనసు దోచుకుంది. పట్టణంలోని గుత్తులవారిపేటలో సుమారు 20 కుటుంబాలు 50 ఏళ్లు వంశపారంపర్యగా సనాతన పద్ధతులతో సోం పాపిడిని తయారుచేస్తూ జీవనం పొందుతున్నారు. ప్రస్తుతం 400 మంది మహిళల వరకు సోం పాపిడి తయారీలో ఉన్నారు. పుల్లల పొయ్యిపై పాపిడి తయారుచేయడం, నాణ్యత పాటించడంతో దీని మధురంగా ఉంటుందని తయారీదారులు అంటున్నారు. గ్యాస్‌ పొయ్యిపై పాపిడి తయారుచేస్తే ఇంత రుచి ఉండదని చెబుతున్నారు. 
 
తినరా మైమరచి..
సోం పాపిడి తయారీకి పంచదార, మైదా, డాల్డా వినియోగిస్తారు. కట్టెల పొయ్యిపై మొదటగా రెండు కిలోల పంచదారలో నీరు పోసి సమపాళ్లలో పాకం ముదిరేవరకు కట్టెలతో మండిస్తారు. దీంతోపాటు మైదా, డాల్డా కలిపి కట్టెల పొయ్యిపై కోవా తయారు చేసుకుని సిద్ధం చేసుకుంటారు. పాకాన్ని, కోవాను పాపిడి తయారు చేయడానికి అనువుగా ఉన్న నాపరాయిపై వేసి కర్ర పుల్లలతో కలుపుతూ ఉండటంతో కొంత సమయానికి సోం పాపిడి పీచు తయారు అవుతుంది. దీనిని మహిళలు కప్పుల్లో కొట్టి పీసులు సిద్ధం చేసి మైకా కవర్లలో ప్యాక్‌ చేసి అమ్మకానికి సిద్ధం చేస్తారు. రెండు కిలోల పంచదార, కిలో మైదా, 600 గ్రాముల డాల్డా మిశ్రమం ద్వారా మూడు కిలోలు సోం పాపిడి తయారవుతుందని తయారీదారులు చెబుతున్నారు. 
 
నేతి పాపిడికి యమ డిమాండ్‌
విదేశాలకు తీసుకువెళ్లే వారు ప్రత్యేకంగా నేతితో పాపిడిని తయారుచేయించుకుంటున్నారు. అమెరికా, కువైట్, దుబాయ్‌ పలు దేశాలతో పాటు, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువులకు పాలకొల్లు సోం పాపిడిని ఇక్కడ తయారుచేయించి పంపిస్తుంటారు. డాల్డాతో చేసిన సోం పాపిడి కిలో రూ.110, నేతితో చేసిన సోం పాపిడి కిలో రూ.250కు విక్రయిస్తున్నాయి. 
 
అభివద్ధికి నోచుకోని కుటుంబాలు
ఎన్నో ఏళ్లుగా సోం పాపిడి తయారుచేస్తున్న ఈ కుటుంబాలు అభివద్ధికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని, బ్యాంకు రుణాలు ఇప్పిస్తే పాపిడి తయారీని విస్తరించవచ్చని అంటున్నారు 
 
బ్యాంకు రుణాలు అందడం లేదు
50 ఏళ్లుగా తాతల కాలం నుంచి సోం పాపిడిని తయారు చేస్తున్నాం. మా తండ్రి చనిపోయాక వ్యాపారాన్ని నేను కొనసాగిస్తున్నా. నాతో పాటు 15 మంది పనిచేస్తున్నారు. ఇతర దేశాలకు మేం పాపిడిని పంపిస్తున్నాం. కట్టెల పొయ్యిపైనే తయారు చేయడం వల్లే ఈ రుచి వస్తుంది. బీసీ కార్పొరేషన్‌ రుణం కోసం రూ.2 లక్షలకు దరఖాస్తు చేశా. అయితే రూ.60 వేలు రుణం మంజూరయ్యింది. కానీ చేతికి సొమ్ములు అందలేదు. తక్కువ వడ్డీకి ప్రభుత్వం రుణ అందిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాం. 
–పెచ్చెట్టి లక్ష్మీ విమల, తయారీదారు, గుత్తులవారిపేట
 
మరిన్ని వార్తలు