పరారైన ముగ్గురు బాలికలు సేఫ్ | Sakshi
Sakshi News home page

పరారైన ముగ్గురు బాలికలు సేఫ్

Published Mon, Oct 24 2016 7:25 PM

3 girls escaped from Residential Social Welfare Girls Hostel in ramagundam

-చేరదీసి పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్లు
- ఇద్దరికి టీసీలిచ్చి ఇళ్లకు పంపించిన వైనం


గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల హాస్టల్ నుంచి 6వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఆదివారం రాత్రి హాస్టల్ గేట్ దూకి పరారయ్యారు. సోమవారం వేకువజామున గోదావరిఖని బస్టాండ్‌కు చేరుకున్న వారిని స్థానిక ఆటోడ్రైవర్లు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు హాస్టల్ నిర్వాహకులను పిలిపించి లేఖ రాయించుకుని వారితో పంపించారు. అయితే పారిపోయిన వారిలో ఇద్దరు బాలికలకు టీసీలిచ్చి ఇళ్లకు పంపినట్లు సమాచారం. రామగుండం పట్టణ శివారులో సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్‌ను, దీనికి అనుబంధంగా పాఠశాల, కళాశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో రామగుండం హాస్టల్‌కు చెందిన 620 మంది, కాటారం మండలంలో ఏర్పాటు చేయదలుచుకున్న హాస్టల్ భవనం ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో అక్కడికి చెందిన 140 మంది 5,6,7 తరగతుల బాలికలు ఉంటున్నారు.

రామగుండం హాస్టల్‌లో ఉండే పి.అంజలి, కాటారం హాస్టల్‌కు చెందిన లక్ష్మీప్రసన్న, ఎస్.మధుప్రియ ఆదివారం రాత్రి 11.30 గంటలకు గేట్ దూకి పారిపోయూరు. విద్యార్థులు గేట్ దూకి పారిపోవడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టినప్పటికీ హాస్టల్ వార్డెన్‌గానీ, వాచ్‌మన్‌గానీ, ఇతర సిబ్బంది గానీ గమనించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలుపుతోంది. హాస్టల్ నుంచి బయటపడ్డ ముగ్గురు విద్యార్థినులు చేతిలో టార్చిలైట్ పట్టుకుని గోదావరిఖని వైపు బయలుదేరారు. అలిసిపోయినప్పుడు మధ్యమధ్యలో ఆగుతూ సోమవారం వేకువజామున 3గంటలకు రామగుండం మజీద్‌టర్నింగ్ నుంచి బీ-పవర్‌హౌస్ వైపు నడుస్తుండగా... ఓ ఆటోడ్రైవర్ గమనించి ఎటు వెళ్తాన్నారని ప్రశ్నించాడు. గోదావరిఖని బస్టాండ్‌కు వెళ్లాలంటే ఆటోలో తీసుకొచ్చి దింపేశాడు. బాలికల ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆటో యూనియన్ నాయకుడు ధర్మేందర్, మరికొందరు వారిని చేరదీసి గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.

పోలీసులు బాలికల నుంచి వివరాలు తెలుసుకొని కాటారం గురుకులం ప్రధానోపాధ్యాయురాలు హైమవతికి ఫోన్‌లో సమాచారం అందించారు. ఆమె వచ్చి పోలీసులకు లేఖ రాసిచ్చి వారిని తీసుకెళ్లారు. అర్ధరాత్రి ఆడపిల్లలు హాస్టల్ నుంచి పరారైతే గుర్తించి అప్పగించినప్పటికీ న్యూసెన్స్ చేయవద్దంటూ ఉపాధ్యాయురాలు హైమవతి ఆటోడ్రైవర్లతో వాగ్వాదం చేయడంతో వారు ఆమె తీరును ఖండించారు. బాలికలు గోదావరిఖని వైపు కాకుండా మరోవైపు వెళితే... వారి పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొన్నారు.

టీసీ ఇచ్చి పంపించారు.. :
లక్ష్మీప్రసన్నది గోదావరిఖని బాపూజీనగర్ కాగా.. పి.అంజలిది కాటారం మండలం మద్దెలపల్లి, ఎస్.మధుప్రియది అదె మండలంలోని స్తంభంపల్లి. వీరిని హాస్టల్‌కు తీసుకొచ్చిన ప్రధానోపాధ్యాయురాలు తల్లిదండ్రులకు సమాచారం అందించి వారు రాగానే లక్ష్మీప్రసన్న, మధుప్రియలకు టీసీలిచ్చి ఇళ్లకు పంపించినట్లు సమాచారం. అంజలి తల్లిదండ్రులు రాకపోవడంతో ఆమెను హాస్టల్‌లోనే ఉంచుకున్నారని తెలిసింది. తాము హాస్టల్‌లో ఉండలేమని పిల్లలు చెప్పడంతో తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లినట్లు హాస్టల్ వర్గాలు చెబుతున్నాయి.

అమ్మానాన్నలు వచ్చినా చూడనివ్వడం లేదు:
హాస్టల్‌లో చేరిన తర్వాత ఇంటిపై, తల్లిదండ్రులపై ధ్యాస ఏర్పడింది. మమ్మల్ని చూడడానికి వచ్చిన అమ్మానాన్నలు వచ్చినా కనీసం మాట్లాడించకుండా బలవంతంగా లాక్కెళ్తున్నారు. మా పేరెంట్స్ వచ్చిన సమాచారం కూడా చెప్పడం లేదు. రామగుండం హాస్టల్ విద్యార్థినులకు భోజనం పెట్టిన తర్వాత కాటారం హాస్టల్ విద్యార్థులకు పెడుతున్నారు. అప్పటిదాకా వేచిఉండాల్సి వస్తుంది. మా తల్లిదండ్రులను చూడాలనే హాస్టల్ నుంచి బయటకు వచ్చాను.     -లక్ష్మీప్రసన్న,విద్యార్థిని

కనీసం కృతజ్ఞత చూపలేదు
హాస్టల్ నుంచి పరారై వచ్చిన ముగ్గురు ఆడపిల్లలు బస్డాండ్‌కు చేరడంతో వారిని గుర్తించి టీ తాగించాను. వారి బాధను తెలుసుకుని ఓదార్చి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించా. అయితే స్టేషన్‌కు వచ్చిన హాస్టల్ ఉపాధ్యాయురాలు పిల్లలను అప్పగించినందుకు కృతజ్ఞత చూపకుండా న్యూసెన్స్ చేయవద్దు, నాకు పెద్ద అధికారులందరు తెలుసు.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల పిల్లలకు రక్షణ ఉండదు.- ధర్మేందర్, ఆటోడ్రైవర్

వేకువజామునే వెళ్లిపోయూరు.. :
పదిహేను రోజుల క్రితం హాస్టల్‌కు వచ్చిన ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ వాతావరణానికి ఇంకా అలవాటుపడలేదు. ఈక్రమంలోనే సోమవారం వేకువజామున వాచ్‌మెన్ విద్యుత్ మోటార్ ఆన్ చేసేందుకు హాస్టల్‌లోకి వచ్చిన సమయంలో విద్యార్థినులు గేట్ దూకి పరారయ్యారు. అప్పటికే వాచ్‌మన్ గుర్తించి మాకు సమాచారం అందించాడు. మేమంతా వెంటనే గాలింపు చర్యలు చేపట్టాం. ఇంతలోనే గోదావరిఖని పోలీస్‌స్టేషన్ నుంచి సమాచారం రావడంతో వెళ్లి తీసుకువచ్చాం. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదు.
- హైమవతి, కాటారంగురుకులం హెచ్‌ఎం
 

Advertisement
Advertisement