దొరికితే దొంగ.. దొరక్కపోతే..

3 Apr, 2016 12:54 IST|Sakshi
దొరికితే దొంగ.. దొరక్కపోతే..

 దొరికితే దొంగ.. దొరక్కపోతే పోలీస్.. సారీసారీ దొర.. ఒక గ్రామంలో నిత్యం కోడి పందాలు జరుగుతున్నాయి. పోలీసులు ఆ వ్యవహారాన్ని ‘మామాళ్లు’గానే పట్టించుకోవడం లేదు. అయితే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు (ఎస్‌బీ) విషయం తెలిసి దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో మన పోలీసులకు దాడులు చేయక తప్పింది కాదు. ఆ దాడుల్లో 10 మందిని అరెస్టు చేసి సుమారు రూ.3 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో అలవాటులో పొరపాటుగా ఏదో అటూఇటూగా రూ.2 లక్షల పైగా సొమ్ము తక్కువ చూపారు. ఈ విషయం డిపార్‌‌టమెంట్‌లో ఆ నోట ఈ నోట.. నాని.. చివరకు ఎస్పీకి చెవికి చేరింది. దీంతో ఆయన సీరియస్ అయ్యి ఎస్‌బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన మన పోలీసులు తెగులు సోకిన కోడిలా విలవిల్లాడిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వివరాలేంటో చూద్దామా?
 
ఏలూరు (సెంట్రల్) : చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలోని ఒక కోడి పందాల శిబిరంపై ఇటీవల పోలీసులు ఆకస్మిక దాడిలో స్వాధీనం చేసుకున్న  భారీ మొత్తంలో సొమ్మును పక్కదారి పట్టించినట్టు  ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పెషల్ బ్రాంచ్ అధికారులను(ఎస్‌బీ) విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొద్దికాలంగా వెంకటాపురంలో రోజూ కోడి పందాలు నిరాటంకంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పందాలపై అక్కడి పోలీసులు ఎటువంటి దాడులు నిర్వహించకపోవడంతో విషయం ఎస్‌బీ అధికారులకు తెలిసింది. వెంటనే దాడులు నిర్వహించాలని చింతలపూడి పోలీసులను ఆదేశించారు.
 
 ఆ సొమ్ములు కోళ్లు ఎత్తుకుపోయాయా?
 ఈ క్రమంలో ఈ నెల 23న చింతలపూడి పోలీసులు వెంకటాపురం గ్రామంలో కోడి పందాల స్థావరంపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.66,750, రెండు కార్లు, నాలుగు మోటారు సైకిళ్లు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్‌ఐఆర్‌లో చూపించారు. అయితే ఈ దాడుల్లో 10 మంది దగ్గర నుంచి రూ.మూడు లక్షలు వరకు  స్వాధీనం చేసుకుని రూ. 66,750 మాత్రమే లెక్కల్లో చూపించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు లెక్కల్లో తేడాలు ఉన్నాయని అక్కడి నిఘా వర్గాలు ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి  తీసుకు వెళ్లడంతో ఆయన  చింతలపూడి పోలీసులు అధికారులపై ఎస్‌బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం.

పోలీసులు నిర్వహించిన  దాడిలో దొరికిన ఓ కాంట్రాక్టరు దగ్గర నుంచే  పోలీసులు రూ.లక్ష వరకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఎస్పీ ఈ విషయంపై సీరియస్‌గా ఉండడంతో సదరు కాంట్రాక్టరుకు తిరిగి డబ్బులు ఇచ్చేందుకు అక్కడే ఓ అధికారి వద్ద పంచాయతీ పెట్టారని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారీ మొత్తాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై జిల్లా పోలీసు బాస్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు