నెల్లూరులో టీడీపీ వర్సెస్ బీజేపీ

24 Apr, 2016 11:12 IST|Sakshi

సై అంటే సై
వెంకటగిరి ఎమ్మెల్యేపై నేదురుమల్లి ఫైర్
‘గిరి’లో రాజుకుంటున్న విభేదాలు


వెంకటగిరి: వెంకటగిరిలో తెలుగుదేశం, కమళదళం నేతలు సై అంటే సై అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీల మధ్య స్నేహబంధం ఎలా ఉన్నా ‘గిరి’లో మాత్రం మిత్రవిభేదం కనిపిస్తోంది. శనివారం ‘గిరి’లో  చేనేత కార్మికులకు ఉపాధి కల్పనపై నిర్వహించిన సదస్సు ఇరుపార్టీల మధ్యన చెదిరిన సయోధ్యకు నిదర్శనంగా నిలిచింది. శుక్రవారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేనేత కార్మికులు, చేనేత జౌళి శాఖ అధికారులను పిలిపించి బీజేపీ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు హాజరుకావద్దని హెచ్చరించినట్లు స్థానికంగా గుసగుసలు వినిపించాయి.

ఇందుకు తగ్గట్టుగానే శనివారం జరిగిన సదస్సుకు చేనేత కార్మికుల పలుచగా హాజరయ్యారు, చేనేత, జౌళీశాఖ జిల్లా అధికారులు డుమ్మాకొట్టారు. దీంతో  బీజేపీ నాయకులు తెలుగుతమ్ముళ్లపై విమర్శలకు దిగారు. పరోక్షంగా ఎమ్మెల్యేను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి విమర్శనాస్త్రాలు సంధిం చగా, మృదుస్వభావి అయిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సైతం ఒకింత ఘాటుగా స్పందిం చారు.

మిత్రపక్షమవడంతో సంయమనం పాటిస్తున్నామని, పోరాట పటిమ లేక కాదు.. అవసరమైతే రోడ్లపైకి ఈడ్చగలమని అన్నారు. వరద బాధిత చేనేతలకు జన్మభూమి కమిటీలు నిర్ధారిస్తేనే పరిహారం మంజూ రు చేస్తారా.. వృద్ధులు ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇస్తారాని విరుచుకుపడ్డారు. 50 శాతం ఓట్లతో గెలిచి నా నియోజకవర్గంలో 100 శాతం ప్రజలకు సేవ చేయాలన్నారు. మీ వారికి న్యాయం చేసుకో, ఇతరులకు అన్యాయం చేస్తే సహించబోమన్నా రు. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి స్థూపాన్ని కూల్చివేయించిన విషయాన్ని టీడీపీ జిల్లా ,రాష్ట్ర అధ్యక్షులు బీద రవిచంద్ర, కళా వెంకట్రావ్, సీఎం చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళుతానన్నా రు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలబోమని నేదురుమల్లి స్పష్టం చేయడంతో,  ప్రజలకు మేలు చేసే పనులను అడ్డుకోవడం ఏమిటని  పలువురు ఎమ్మెల్యే తీరుపై సభలో గుసగుసలాడుకున్నారు.

మరిన్ని వార్తలు