విషకౌగిలి

18 May, 2017 00:08 IST|Sakshi
విషకౌగిలి

కాలుష్యపు కోరల్లో గోళ్లాపురం
జనం ప్రాణాలు తీస్తున్న పరిశ్రమలు
కన్నెత్తి చూడని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు
ప్రత్యామ్నాయం చూపడంలో జిల్లా యంత్రాంగం విఫలం


తమ ఊరి వద్ద పారిశ్రామికవాడ వస్తోందంటే వారంతా సంతోషించారు. ఉద్యోగాలు, ఉపాధి స్థానికంగానే లభిస్తాయని ఆశించారు. తమ బతుకులు బాగుపడతాయనుకున్నారు. అయితే.. ఇవే పరిశ్రమలు తమ ఉసురు తీస్తాయని ఆనాడు ఊహించలేకపోయారు. పారిశ్రామిక విషకౌగిలిలో చిక్కుకుని ప్రస్తుతం విలవిలలాడుతున్నారు. ఇక్కడ ఉండలేక, వేరే ప్రాంతానికి తరలివెళ్లలేక హిందూపురం శివారులోని గోళ్లాపురం వాసులంతా నలిగిపోతున్నారు.  

హిందూపురం అర్బన్‌ : హిందూపురం పట్టణ శివారులోని గోళ్లాపురం గ్రామం 1,790వ సంవత్సరంలోనే ఏర్పడింది. ప్రస్తుతం ఈ గ్రామంలో 621 ఇళ్లు ఉన్నాయి. జనాభా 2,625 మంది. ఈ ఊరి వద్ద 1985లో అప్పటి ముఖ్యమంత్రి, హిందూపురం ఎమ్మెల్యే ఎన్టీ రామారావు పారిశ్రామికవాడను ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామం చుట్టూ వందకు పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నడుస్తున్నాయి. వీటిలో ఐరన్‌ఓర్, ఐరన్‌ స్క్రాబ్‌æ, రసాయనిక మందులు, వాయువుల తయారీ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వీటి నుంచి వెలువడే వాయువులు, వ్యర్థాల వల్ల పర్యావరణంతో పాటు భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పటికే పంట పొలాలు దెబ్బతిన్నాయి. బోరుబావుల్లో కలుషిత నీరు వస్తోంది. గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. పురిటి బిడ్డలు, పెరిగే చిన్నారులపై సైతం కాలుష్య ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. పలువురు క్షయ, కేన్సర్‌, చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. పిల్లలు బుద్ధిమాంద్యులు గాను, కాళ్లు చచ్చుబడి అవిటివారు గాను మారుతున్నారు. గర్భస్రావాలు అవుతుండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు.

వీరేం చేశారు పాపం!
 గ్రామానికి చెందిన ఆదిలక్ష్మమ్మ పెద్దకుమారుడు వరణ్‌ వయసు 20 ఏళ్లు. కాళ్లూ చేతులు చచ్చుబడిపోయాయి. బుద్ధిమాంద్యం కూడా ఉంది. వెంకటేష్‌ కుమారుడు చరణ్‌ నడుము, కాళ్లూ చేతులు చచ్చుబడి, మాటలు రాక అవిటివాడయ్యాడు. అదినారాయణ కుమారుడు పదేళ్ల వెంకటేష్‌ కూడా బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నాడు. ఇరవై ఏళ్ల అశ్విని కాలుచేయి వంకరతో వికలాంగురాలిగా మారింది. వీరే కాకుండా పలువురు శ్వాసకోస వ్యాధులు, వణుకుడు రోగం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తులు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా.. పరిశ్రమల్లో వారికేమైనా ఉద్యోగాలు, ఉపాధి లభించాయా అంటే అదేమీ లేదు. పరిశ్రమల యజమానులు ఎక్కువగా స్థానికేతరులనే పనుల్లో పెట్టుకుంటున్నారు. ప్రమాదకరమైన పనులు చేయిస్తుండటంతో ఏదైనా జరిగినప్పుడు స్థానికులైతే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో ఇతర ప్రాంతాల వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

తీర్మానాలు, ఫిర్యాదులు చేసినా..
పారిశ్రామిక కాలుష్య ప్రభావం గోళ్లాపురంతో పాటు తూమకుంట, పెద్దగుడ్డంపల్లి గ్రామాలపైనా ఉంది. ఈ విషయాన్ని జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ రెండేళ్లుగా జిల్లా పరిషత్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. జెడ్పీ చైర్మన్‌ చమన్‌కు కూడా ఫిర్యాదులు చేశారు. అలాగే తూమకుంట, గోళ్లాపురం గ్రామపంచాయతీ సర్పంచులు లక్ష్మమ్మ, నాగార్జున స్థానికులతో కలిసివెళ్లి కర్నూలులోని కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏడీ రెండు రోజుల పాటు పరిశ్రమలలో తనిఖీలు చేసి వెళ్లారు. అయితే..ఎలాంటి చర్యలూ లేవు.

యాజమాన్యాల ఇష్టారాజ్యం
పరిశ్రమల యజమానులు కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. సామాజిక బాధ్యత కింద పర్యావరణ పరిరక్షణకూ చొరవ చూపడం లేదు. దీంతో స్థానికులు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటున్నారు. ఫిర్యాదులు చేసినప్పుడు వచ్చి హడావుడి చేసే అధికారులు..ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. గతంలో వారొచ్చి తీసుకెళ్లిన నీరు, మట్టి, ఇతరత్రా నమూనాల ఫలితాలు ఎలా వచ్చాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అధికారులకు చెప్పిచెప్పి అలసిపోయామని, ఇక మీదట ఫిర్యాదులు చేసే ఓపిక కూడా తమకు లేదని గ్రామస్తులు చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పరిశ్రమల నిర్వాహకులు ప్రతినెలా గ్రామంలో వైద్యపరీక్షలు నిర్వహించాలి. ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించాలి. అలాగే శుద్ధమైన నీరు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇవేవీ గోళ్లాపురంలో కన్పించడం లేదు.
 
రాత్రి 12 తర్వాత ఊపిరాడదు –లక్ష్మినరసమ్మ, గోళ్లాపురం
రాత్రి 12 తర్వాత పరిశ్రమల నుంచి భారీఎత్తున పొగ వదులుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా దుర్వాసన భరించలేం. దీనికితోడు నీళ్లు రుచి మారిపోతున్నాయి. ఒక్కొక్కసారి రంగు మారిన నీరు వస్తోంది. గత్యంతరం లేక హిందూపురం నుంచి వస్తున్న శుద్ధజలాన్ని కొంటున్నాం. గ్రామంలో దొరికే నీటిని ఇతర అవసరాలకు మాత్రమే వాడుతున్నాం.

పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి–ఆదిలక్ష్మి, గోళ్లాపురం
పారిశ్రామిక కాలుష్యం చిన్నారులకు ప్రాణాంతకంగా తయారైంది. చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్నారు. వారు పడుతున్న బాధ చూడలేకపోతున్నాం. ఇక్కడ చాలామంది కూలి పనులు చేసుకునే వారే. అచేతనంగా పడిఉన్న పిల్లలను ఇంటివద్ద ఉంచి పనులు వెళ్లాల్సివస్తోంది. వారు నోరు తెరిచి నీళ్లు, ఆహారం అడగలేరు. తల్లులే అర్థంచేసుకుని అన్నం పెట్టాలి. ఇంత దారుణమైన పరిస్థితులున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

మరిన్ని వార్తలు