ప్రాణాలకు వెల.. న్యాయం డీలా..

7 Apr, 2017 00:05 IST|Sakshi
మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో వెలువడిన విష వాయువులు ఐదుగురు కూలీల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. మనుషుల ప్రాణాలకు వెల కట్టేసి.. న్యాయానికి పాతరేసేందుకు దిగువ స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు తమవంతు సహాయం అందిస్తున్నారు. మరణాలకు కారణ మైన యాజమాన్యంపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని.. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ తదితరులు వేలాది ప్రజల సమక్షంలో ప్రకటించినా.. తెరవెనుక మాత్రం వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మనుషుల ప్రాణాలకు డబ్బుతో విలువ కట్టేస్తే సరిపోతుందనుకున్నంత కాలం మొగల్తూరు ఘటన లాంటి దారుణాలు పునరావృతమవుతూనే ఉంటాయి. నల్లంవారి తోటలోని అనంద ఆక్వా ప్లాంట్‌ ట్యాంక్‌ నుంచి గతనెల 30న విష వాయువులు వెలువడి ఐదుగురు కూలీలు మృత్యువాతపడిన విషాద ఘటన విదితమే. ఆ తరువాత మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతోంది. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై ఈగ వాలకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతుండటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆనంద ఆక్వా యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘోర ఘటనకు కారణమని మంత్రులు ప్రకటించినా ఇప్పటివరకూ ఆ కేసులో పురోగతి లేదు. కనీసం యాజమాన్య ప్రతినిధులను పిలిచి విచారణ జరిపిన దాఖలాలు కూడా లేవు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుండగా.. మరణాలు విషవాయువుల వల్ల సంభవించలేదని.. విద్యుదాఘాతమే కారణమని ఆక్వా ప్లాంట్‌ యాజమాన్యం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ప్రారంభించింది.  మరోవైపు ఇదే యాజమాన్యం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వా ఫుడ్‌ పార్క్‌కు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మద్దతుగా నిలవడం విశేషం.
 
అన్నీ అతిక్రమణలే..
గొంతేరు కాలువ నీటినే తాగునీరుగా వినియోగిస్తున్నామని, మొగల్తూరు ఆక్వా ప్లాంట్‌ గొంతేరులో వదులు తున్న కాలుష్యం వల్ల తామంతా ఇబ్బంది పడుతున్నామ ని 25 గ్రామాల ప్రజలు కాలుష్య నియంత్రణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ప్లాంట్‌ యాజమాన్యం పైప్‌లైన్ల ద్వారా కాలుష్యాన్ని నేరుగా గొంతేరు కాలువలోకి వదిలిపెడుతోందని ముత్యాలపల్లి, మొగల్తూరు, గరువుపల్లవ పాలెం, గుంటపల్లిపాలెం ప్రజలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌లో కాలుష్య నియంత్రణ బోర్డు టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలకు వచ్చింది. ప్లాంట్‌లో అన్నీ అతిక్రమణలే కనిపించాయని నిర్థారించింది. రెండు నెలల్లోగా అతిక్రమణలను యాజ మాన్యం సవరించుకోవాలని స్పష్టం చేసింది. ప్లాంట్‌నుంచి వస్తున్న వ్యర్థాలను గొంతేరు కాలువలో కలుపుతున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు గుర్తించారు. ఈ ప్లాంట్‌ అవసరాలకు రోజుకు 59 వేల లీటర్ల నీటిని ఉపయోగిస్తామని యాజమాన్యం చెప్పిన్పటికీ.. 1.12 లక్షల లీటర్ల వినియోగిస్తున్నట్టు గుర్తించారు. నీటి మీటర్లను ఏర్పాటు చేయలేదని తప్పుపట్టారు. రోజుకు 40 వేల లీటర్ల నీరు మాత్రమే బయటకు విడుదల చేస్తున్నట్టు ప్లాంట్‌ యాజ మాన్యం పేర్కొనగా.. అంతకుమించి వస్తున్నట్టు తనిఖీలలో తేలింది. కేవలం 10 టన్నుల రొయ్యల సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పుతున్నట్టు పేర్కొన్న యాజమాన్యం 30 టన్నుల సామర్థ్యంతో దీనిని నిర్మించినట్టు టాస్క్‌ ఫోర్స్‌ బృందం గుర్తించింది. గొంతేరులో కలుస్తున్న రెండు పైపులైన్లను వెంటనే తొలగించాలని అదేశించింది. ఎట్టిపరిస్థితుల్లో వ్యర్థాలను ప్లాంట్‌నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించింది. ప్రతిరోజూ ఎంత సరుకు ప్రాసెస్‌ చేస్తున్నారనే దానిపై రికార్డులు నిర్వహిం చాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేస్తున్నది, లేనిది రెండు నెలల్లో పరిశీలించి నివేదిక ఇవ్వాలని పర్యావరణ ఇంజినీరుకు జనవరి 12న ఆదేశాలిచ్చింది. వ్యర్థాలను, కాలుష్యాన్ని నేరుగా గొంతేరులో కలుపుతున్న పైప్‌లైన్లను నేటికీ అలాగే ఉంచేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించలేదు. రెండు నెలల తర్వాత తాము ఫ్యాక్టరీని సందర్శించామని, ఇంకా నివేదిక ఇవ్వలేదని, ఇంతలోనే ఘటన జరిగిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. పర్యావరణ ఇంజినీరు సక్రమంగా తనిఖీ చేసినా వాస్తవాలు బయటపడేవి. ఐదుగురి ప్రాణాలు నిలిచేవి. పర్యావరణ ఇంజినీర్‌ ఆ పని చేయకపోవడం, జిల్లా అధికారులు పరిశ్రమ యాజమాన్యానికి కొమ్ముకాయడంతో ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరిచి తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా పార్క్‌ పనులను నిలిపివేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 
 
>
మరిన్ని వార్తలు