పుష్కర స్నానం.. పిండ ప్రదానం

3 Aug, 2016 00:32 IST|Sakshi
పుణ్యస్నానాలు

 గోదారి తీరంలో భక్తజనం
 పితదేవతలకు తర్పణాలు
 అమావాస్య కావడంతో ప్రాధాన్యం

గోదావరి అంత్య పుష్కరాల మూడో రోజు మంగళవారం అమావాస్య కావడంతో పితృదేవతలకు తర్పణాలు వదిలారు. గోదావరి మాతకు పసుపు, కుంకుమ, వస్త్రాలను సమర్పించి పుణ్యస్నానాలు ఆచరించారు. దీపారాధన చేసిన తరువాత వాటిని భక్తి శ్రద్ధల నడుమ నీటిలో విడిచారు. స్నానఘట్టాల రేవులో పితృదేవతలకు పూజలు చేసి.. పిండాలను గోదావరిలో వదిలారు.


భద్రాచలం :  
    గోదావరి తీరం ఉప్పొంగింది. భక్తజన సందోహంగా మారింది. గోదావరి అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మూడోరోజు మంగళవారం అమావాస్య కావడంతో భక్తులు ఒకింత పలుచబడినా.. బుధవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుండటంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేశారు. స్నానఘట్టాల రేవులో గోదావరి మాతకు పసుపు, కుంకుమ, వస్త్రాలను సమర్పించారు. దీపారాధన చేసిన తరువాత వాటిని భక్తి శ్రద్ధల నడుమ నీటిలో వదిలారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన భక్తులు గోదారి తీరంలో పుణ్యస్నానాలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపారు. ఓవైపు భక్తిభావం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరింతల నడుమ స్నానాలు ఆచరించారు. గోదావరి ఒడ్డున ఉన్న అభయాంజనేయస్వామి, సుబ్రమణేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకొని పూజలు చేశారు. పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామివారికీ పూజలు నిర్వహించి, దేవస్థానం అర్చకులు అందజేసిన తీర్థప్రసాదాలను స్వీకరించారు.
పితృతర్పణాలకు ప్రాధాన్యం
పుష్కరాల మూడో రోజైన మంగళవారం అమావాస్య కావటంతో పుష్కరస్నానం చేసే భక్తులు కొంతమేర  తగ్గారు. గోదావరి తీరంలో పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు పలువురు ప్రాధాన్యం ఇచ్చారు. స్నానఘట్టాల రేవులో పితృదేవతలకు పూజలు చేశారు. పిండాలను గోదావరిలో వదిలారు. మృతిచెందిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పేరిట పూజలు చేసి గోదావరిలో తర్పణాలు వదిలారు.
వసతి లేక ఇబ్బందులు
గోదావరి తీరంలో భక్తులు వేచి ఉండేందుకు ఎటువంటి వసతి లేకపోవటంతో ఇబ్బంది పడ్డారు. మంగళవారం రోజంతా వర్షం పడుతూనే ఉండటంతో స్నానమాచరించిన అనంతరం ఎటువంటి సౌకర్యం లేక భక్తులు ఇబ్బంది పడ్డారు.

>
మరిన్ని వార్తలు