సైబర్‌ కేఫ్‌లకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

3 Aug, 2016 20:15 IST|Sakshi
సైబర్‌ కేఫ్‌లకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

► నగర పోలీసు అధికారుల నిర్ణయం
► అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా నమోదుకు ఏర్పాట్లు
► వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్తవిధానం

సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడి, నగరంతో పాటు దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసాలకు కుట్రపన్ని చిక్కిన ‘జుందుల్‌ ఖిలాఫత్‌ ఫీ బిలాద్‌ అల్‌ హింద్‌’ (జేకేబీహెచ్‌) ఉగ్రవాదులు పాతబస్తీలోని ఇంటర్‌నెట్‌ కేఫ్‌ల్నీ వినియోగించారు. ఈ మాడ్యూల్‌ అనధికారిక చీఫ్‌ ఇబ్రహీం యజ్దానీ సహా మిగిలిన వారికీ కంప్యూటర్‌ సదుపాయం ఉన్నా... ఐసిస్‌కు సంబంధించిన కీలక వీడియోలు, సమాచారం డౌన్‌లోడ్‌ చేసుకోవడానికీ నెట్‌కేఫ్‌ల్నే వాడారు.

∙కేవలం జేకేబీహెచ్‌ మాడ్యూల్‌ మాత్రమే కాదు.. గతంలో సిటీలో చిక్కిన ఉగ్రవాదుల్లో అనేక మంది విచారణలో ‘నెట్‌కోణం’ వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు సైబర్‌ నేరాలకూ ఇంటర్‌నెట్‌ సెంటర్లు అడ్డాగా మారుతున్నాయని నగర పోలీసు విభాగం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని నియంత్రించడానికి చర్యలు ప్రారంభించింది. సిటీలోని నెట్‌కేఫ్‌లకు పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

లెక్క తెలిస్తేనే ‘లెక్కలకు’ ఆస్కారం...
జంట నగరాల్లోని నెట్‌కేఫ్‌లపై నిఘా ఉంచాలంటే ముందు ఏఏ ఠాణా పరిధిలో ఎన్ని నెట్‌ సెంటర్లు ఉన్నా యో? ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కీలకం. ఇప్పటి వరకు పోలీసుల వద్ద వీరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకపోడంతో ఈ డేటా పూర్తి స్థాయిలో, పక్కాగా అందుబాటులో లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సిటీ పోలీసు ఉన్నతాధికారులు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్‌లో ఉన్న అంశాలను అమలులోకి తీసుకొస్తూ రిజిస్ట్రేషన్‌ తప్పని సరి  చేయనున్నారు. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

‘ఆధార్‌' లింక్ చేసుకోవాల్సిందే...
ఐటీ యాక్ట్‌ ప్రకారం ప్రతి ఇంటర్‌నెట్‌ కేఫ్‌ విధిగా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుం ది. నగర పోలీసులు ఈ రిజిస్ట్రేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లోనే ఓ లింకే ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. మొత్తం 24 అంశాలతో ఉండే ఆన్‌లైన్‌ దరఖాస్తును నిర్వాహకులు పూరించాల్సి ఉంటుంది. బోగస్‌ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయడానికి యజమాని ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయడం తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే ఈ దరఖాస్తుల్ని నేరుగా ఉన్నతాధికారులే పరిశీలించడంతో పాటు నెట్‌కేఫ్‌ల డేటాబేస్‌ రూపొందించి వాటిపై కన్నేసి ఉంచుతారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా అక్రమంగా కొనసాగే నెట్‌కేఫ్‌ల పైనా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు