మరణంలోనూ వీడని బంధం

21 Jun, 2017 11:34 IST|Sakshi
మరణంలోనూ వీడని బంధం

► ఆర్టీసీ బస్సు ఢీకొని అన్నదమ్ములు మృతి
► పిన్నమ్మ ఇంటికి వెళ్తూ అనంతలోకాలకు
► దయ్యాలవారిపల్లె అటవీప్రాంతంలో ఘటన
► శోకసంద్రంలో బోడికిందపల్లె


చేతికొచ్చిన కొడుకులు ఉన్నత చదువులు చదివి, జీవితంలో స్థిరపడితే చూడాలని ఆ తల్లిదండ్రులు ఆరాటపడ్డారు. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా ఎన్నో కష్టాలకోర్చి కొడుకులిద్దర్నీ ఉన్నత చదువులు చదివించారు. డీగ్రీ పూర్తిచేసిన పెద్దకొడుకుతో పాటు సీఏ చదువుతున్న చిన్నకొడుకుని చూసి మురిసిపోయారు. కష్టాలు తీరినట్టేనని సంబరపడ్డారు. కానీ ఆ దంపతుల సంతోషాన్ని చూసి విధి ఓర్చుకోలేకపోయింది. రోడ్డు ప్రమాద రూపంలో ఇద్దరి బిడ్డల్ని పొట్టనపెట్టుకుని పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది.

బి.కొత్తకోట: మరణంలోనూ తమ బంధాన్ని వీడలేదు తంబళ్లపల్లె మండలానికి చెందిన ఆ అన్నదమ్ములు. పిన్నమ్మ ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బి.కొత్తకోట–చలిమామిడి మార్గంలోని దయ్యాలవారిపల్లె అటవీప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

తంబళ్లపల్లె మండలం బోడికిందపల్లెకు చెందిన తూగు రామలింగారెడ్డికి టి.వినోద్‌ కుమార్‌రెడ్డి (24), టి.దిలీప్‌ కుమార్‌రెడ్డి (21) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికింకా వివాహాలు కాలేదు. వినోద్‌ డిగ్రీ పూర్తి చేశాడు. దిలీప్‌ విజయవాడలో సీఏ చదువుతున్నాడు. ఇతని చదువు కోసం డబ్బు అవసరమైంది. బి.కొత్తకోట మండలంలోని సూరపువారిపల్లెలో ఉంటున్న పిన్నమ్మ (కుమారమ్మ) ఇంటికి తమ స్వగ్రామం నుంచి బైక్‌లో బయలుదేరారు. ఇదే సమయంలో కుమారమ్మ కొడుకు గోకుల్‌ (13) ఉదయం బి.కొత్తకోట ఆస్పత్రికి వెళ్లాడు.

విషయం తెలుసుకున్న కుమారమ్మ.. ఇంటికి అన్నయ్యలు వస్తున్నా రు, మాంసం తీసుకొని వారితో కలిసి రమ్మంటూ ఫోన్‌ చేసింది. గోకుల్‌ వంటసామగ్రి తీసుకుని అన్నలతో కలిసి ద్విచక్ర వాహనంలో సూరపువారిపల్లెకు బయలుదేరాడు. అటవీ ప్రాంతంలోని ఆంజనేయస్వామి ఆల యం సమీపంలోని మలుపువద్దకు రాగానే చలిమామిడి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరిని వేగంగా  ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ గాలిలోకి ఎరిగిపడ్డారు. వినోద్, దిలీప్‌ అక్కడికక్కడే మృతి చెందారు. గోకుల్‌ తలకు తీవ్రగాయమైంది. బస్సు కండక్టర్‌ 108కు ఫోన్‌ చేసినా అంబులెన్స్‌ ఘటనా స్థలానికి చేరుకోలేదు.

ఎస్‌ఐ మల్లికార్జున గోకుల్‌ను ఆటోలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. బస్సు డ్రైవర్‌ ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహనానికి దారి ఇచ్చి ఉంటే ప్రమాదం జరిగేది కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ములకల చెరువు సీఐ రిషికేశవ, మదనపల్లె ఎంవీఐ రాజగోపాల్‌ పరిశీలించారు. మృతుల తండ్రి తూగు రామలింగారెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మల్లికార్జున కేసు నమోదు చేశారు.

రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇల్లు
ప్రమాదం జరిగిన స్థలానికి సూరపువారిపల్లె రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరో ఐదారు నిమిషాల్లో ఇల్లు చేరేవారు. ఇంతలో ఆర్టీసీ బస్సు వారిపాలిట యమపాశంలా మారింది. కాగా ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బి.శ్రీనివాసులు సూరపువా రిపల్లె వాసే కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు