పెళ్లింట విషాదం

26 May, 2017 23:52 IST|Sakshi
పెళ్లింట విషాదం
రెండు ప్రాణాలను బలిగొన్న మిల్లర్‌
రోడ్డు ప్రమాదంలో మేనమామ, మేనల్లుడు మృతి
తుని రూరల్‌ : తుని మండలం తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న మిల్లరు ఆటోను మోటార్‌ సైకిల్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో సీలి వెంకటరమణ (22) అక్కడికక్కడే మృతి చెందగా ఎస్‌కే అమర్‌ (అమర్నాథ్‌) (4) తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్‌ ఎస్సై ఎం.అశోక్‌ తెలిపారు. వీరిద్దరూ శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం ఒకే కుటుంబానికి చెందిన మేనమామ, మేనల్లుడన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్‌ ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జూన్‌ ఐదున జరగనున్న తన సోదరుడి వివాహానికి బంధువులను పిలిచేందుకు కత్తిపూడికి చెందిన వెంకటరమణ మేనల్లుడు అమర్‌తో కలసి మోటార్‌ సైకిల్‌పై తుని వచ్చారు. శుభలేఖలు పంపిణీ చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో  రాజులు కొత్తూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన అమర్‌ను ప్రత్యేక వాహనంలో తుని ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. కొద్దిసేపు చికిత్స పొందుతూ అమర్‌ మృతి చెందినట్టు ఆయన వివరించారు. కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రూరల్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 
అలముకున్న విషాదం
జూన్‌ ఐదున జరగనున్న వివాహ వేడుకలతో ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట విషాదమే మిగిలింది. తన సోదరుడు చంద్రరావు వివాహం దగ్గరుండి చేసేందుకు హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వెంకటరమణ ఇటీవల స్వగ్రామం కత్తిపూడి వచ్చాడు. పది రోజులు గడువు ఉండడంతో బంధువులను స్వయంగా ఆహ్వానించేందుకు మేనల్లుడు అమర్‌ను తీసుకుని మోటార్‌ సైకిల్‌పై బయలుదేరాడు. తుని ప్రాంతంలో బంధువులకు శుభలేఖలు ఇచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. రాజులు కొత్తూరు వద్ద ఆగి ఉన్న మిల్లరు ఆటోను ఢీకొని మృత్యువాత పడ్డారు. చేతికి అందివచ్చిన చిన్న కొడుకు వెంకటరమణ, అల్లారు ముద్దుగా చూసుకుంటున్న పెద్ద మనమడు అమర్‌ మృతి చెందడంతో సీలి మరియరాణి, సీలి ముసలియ్య దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు తన వివాహం జరిపించేందుకు వచ్చిన సోదరుడు మృతి చెందాడని పెళ్లి పీటలు ఎక్కాల్సిన  చంద్రరావు, పెద్ద కుమారుడిని కోల్పోయామని అమర్‌ తల్లిదండ్రులు ఎస్‌కే దుర్గ, నాగలక్ష్మి  బోరున విలపిస్తున్నారు. పెళ్లింట విషాదం నెలకొనడంతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. విషయం తెలియడంతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకుని విలపిస్తున్నారు.
మరిన్ని వార్తలు