నష్టాలు అధిగమించేందుకు.. ఆర్టీసీ అడుగులు

19 Mar, 2017 23:30 IST|Sakshi
నష్టాలు అధిగమించేందుకు.. ఆర్టీసీ అడుగులు

 రాజంపేట: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల నుంచి బయట పడేందుకు అడుగులు వేస్తోంది... ఇందుకోసం వినూత్న ప్రయోగాలు చేపడుతోంది... ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికుల నుంచి అభిప్రాయాలు, కమిట్మెంట్‌ పత్రాలు తీసుకుంటోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కడప రీజియన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.72 కోట్లలో నష్టాల్లో ఉంది. జిల్లాలో కడప, రాజంపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, పులివెందుల డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలు కూడా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు కడప రీజనల్‌ మేనేజర్‌ చెంగల్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ‘ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికులదే ప్రధాన పాత్ర’ అనే ఉద్దేశంతో కార్మికుల అభిప్రాయం, వారి సహకారం తీసుకుని ముందుకు వెళ్తే నష్టాలను కొంత మేర అయినా తగ్గించవచ్చనే ఆలోచనతో కడప రీజియన్‌ ముందడుగు వేస్తోంది.
అభిప్రాయ సేకరణ..
డిపోల వారీగా కార్మికుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలు పెట్టింది. ఉదాహరణకు రాజంపేట డిపోను తీసుకుంటే రూ.10.80 కోట్ల నష్టాల్లో ఉంది. కిలోమీటరుకు ఆదాయం రూ.27.11 ఉండగా, ఖర్చు రూ.35.78 అవుతోంది. అంటే కిలోమీటరుకు రూ.8.67 నష్టం వస్తోంది. ఈ విధమైన పరిస్థితులే ప్రతి డిపోలో ఉన్నాయి. కిలోమీటరుకు ఎంత సంపాదన వస్తోంది, ఏ మేరకు ఖర్చు వస్తోంది, నష్టాలు తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకోవాలి.. వంటి వివరాలను కార్మికుల నుంచి సేకరిస్తున్నారు. 2016–2017లో వచ్చిన ఈపీకే, 2017–2018లో తీసుకొచ్చిన ఈపీకే వివరాలను కార్మికుల నుంచి సేకరిస్తున్నారు. 2016 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి వరకు ఈపీకే సాధించిన వివరాలను ఆర్టీసీ యాజమాన్యానికి రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది.
కమిట్మెంట్‌ పత్రం..
కడప రీజియన్‌లో 8 డిపోలు ఉన్నాయి. 4 వేల మంది కార్మికులు ఉన్నారు. 936 సర్వీసులు నడుస్తున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు సర్వీసు వారీగా ఈపీకే తెచ్చుటకు నిబద్ధతతో పని చేస్తామంటూ కమిట్మెంట్‌ పత్రాన్ని అందజేస్తున్నారు. సర్వీసు అభివృద్ధికి సలహాలు, సూచనలు కూడా ఈ పత్రం ద్వారా ఆర్టీసీకి తెలియజేయాల్సి ఉంటుంది. తాము పని చేస్తున్న డిపో అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని, ఆదాయం పెంచేందుకు, ఖర్చు తగ్గించేందుకు సూచనలను ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్నారు. కేఎంపీఎల్‌ పెంచేందుకు అవసరమైన చర్యలపై ఆర్టీసీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే అంశాన్ని యాజమాన్యానికి డ్రైవర్లు కమిట్మెంట్‌ పత్రం ద్వారా తెలియజేయాలి. ఈ పత్రంలో పేరు, హోదా, స్టాప్‌ నంబరు కూడా పొందుపరచాల్సి ఉంటుంది. ఈ పత్రంలో వచ్చిన సూచనలు, సలహాలను ఏ వి«ధంగా, ఏ స్ధాయిలో అమలు చేయాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

నిర్భయంగా పొందుపరచాలి
ఆర్టీసీ అభివృద్ధి కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణ, కమిట్మెంట్‌ పత్రంలో కార్మికులు తమ మనోగతాన్ని నిర్భయంగా పొందుపరచాలి. దీనివల్ల ఆర్టీసీ యాజమాన్యం సరిదిద్దుకొని నష్టాల నుంచి గట్టెక్కేందుకు వీలవుతుంది. ఆర్‌ఎం చెంగలరెడ్డి ఆదేశాల మేరకు ఈ విధానం చేపడుతున్నాం.
                                    –ఎంవీ కృష్ణారెడ్డి, మేనేజర్‌, రాజంపేట డిపో

సమష్టి కృషి అవసరం
ఆర్టీసీ లాభాల బాటకు సమష్టి కృషి అవసరం. ఆర్టీసీ నష్టాలో నడుస్తుంటే కార్మికులకు కూడా నష్టమే. సంస్థ బాగుంటే అందరం బాగుంటాం. కమిట్మెంట్‌ పత్రంలో కార్మికులు తెలియజేసే సూచనలు, మనోగతం సంస్థ అభివృద్ధికి దోహద పడతాయి.
                                   –జీవీ నరసయ్య, రాష్ట్ర కార్యదర్శి, ఈయూ, కడప

కార్మికులు భాగస్వాములు కావాలి
నష్టాల్లో రోజురోజుకు కూరుకుపోతున్న ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కార్మికులు భాగస్వాములు కావాలి. అభిప్రాయ సేకరణ, కమిట్మెంట్‌ పత్రాలు తీసుకుంటున్న ఆర్టీసీకి కార్మికులు తమ మనోగతం వివరించేందుకు ముందుకు వస్తున్నారు. మంచి ఫలితాలు రావాలనే ఆశిస్తున్నాం.
                              –సుబ్బారెడ్డి, సెక్రటరీ, వైఎస్సార్‌ ఆర్టీసీ ఎంయూ, రాజంపేట













 

మరిన్ని వార్తలు