కాషాయ దళం.. ‘విమోచన’ గళం

18 Sep, 2016 01:14 IST|Sakshi
కాషాయ దళం.. ‘విమోచన’ గళం
 వరంగల్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోరాట క్రమాన్ని గుర్తు చేసుకుంటూ సమరయోధుల త్యాగాలను స్మరించుకునేందుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా యాత్ర ముగింపు సభ వరంగల్‌లో శనివారం జరిగింది. ఇదే వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హన్మకొండ జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్‌)లో జరిగిన ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పలువురిని ఈ సభలో సన్మానించగా.. కళాకారులు ప్రదర్శించిన వీర తెలంగాణ పోరాట నృత్యరూపకం ఆకట్టుకుంది.
 
 
స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానం
 
హన్మకొండ : తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు వోడపల్లి వెంకట్రాం నర్సయ్య, ఒద్దుల చంద్రారెడ్డి, అడవయ్య, పాశికంటి వీరస్వామితో పాటు బత్తిని మొగిలయ్య కుమారుడు బత్తిని బాబును శాలువా కప్పి సన్మానించారు. వీరితో పాటు మరో 50 మందిని పార్టీ నాయకులు సన్మానించారు. 
 
బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
హన్మకొండ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాకతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. 2019 సంవత్సరంలో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు అమిత్‌షా రాష్ట్రంలో మూడోసార్లు పర్యటించడం గమనార్హం. ఇంతకు ముందు సూర్యాపేట, హైదరాబాద్‌లలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రులు హన్స్‌రాజ్‌ గంగారం అహిర్, బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు, నాయకుడు సోదన్‌సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్, పార్టీ శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు శాసన సభాపక్ష ఉప నేతలు రాంచంద్రారెడ్డి, వి.వి.ఎస్‌.ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నెహ్రూ యువ సంఘటన్‌ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, వరంగల్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, నాయకులు డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, ఒటేరు జయపాల్, వన్నాల శ్రీరాములు, మందాడి సత్యనారాయణరెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్, రావు అమరేందర్‌రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.'
 
అమిత్‌షాకు సన్మానం
 
వరంగల్‌ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, వరంగల్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి నాయకులు డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు, రావు పద్మ, చాడా శ్రీనివాస్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు శాలువా కప్పి అమిత్‌షాను సన్మానించారు. జ్ఞాపికలు అందజేశారు. ఆయన తలకు టోపీ ధరింపజేసి కరవాలం, గదను అందజేశారు. 
 
‘చరిత్రను మరిచిన టీఆర్‌ఎస్‌’
 
 న్యూ శాయంపేట : టీఆర్‌ఎస్‌ పార్టీ ఓట్ల రాజకీయంలోపడి తెలంగాణ చరిత్రను మర్చిపోయే స్థితికి దిగజారిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవాల్లో జాతీయ పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు పాల్గొని, అమరులకు నివాళులు అర్పించడం అభినందనీయమన్నారు. విశ్వకర్మ దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం మూడూ ఇదే రోజు జరగడం విశేషమన్నారు. సెప్టెంబర్‌ 17 చరిత్రను ఎవరు మరువలేరన్నారు. 
 
తెలంగాణ పోరాటం అజరామరం
 
హన్మకొండ : నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ ప్రజానీకం స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగిడిన రోజు సెప్టెంబర్‌ 17 అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్‌ అన్నారు. హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్‌)లో శనివారం బీజేపీ తిరంగా యాత్ర ముగింపు సభ జరిగింది. ఇదే వేదికగా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించారు. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్య​ అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17కు సంబంధించి చారిత్రక ప్రాధాన్యాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు. నాటి కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ ఉక్కు సంకల్పంతో నిజాం అరాచక పాలనకు తెరపడిందన్నారు. తెలంగాణతో ఉక్కు మనిషి వల్లాభాయ్‌ పటేల్‌కు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలనే డిమాండ్‌తో ముందుకెళ్తున్న రాష్ట్ర బీజేపీకి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మద్దతు ప్రకటించడం పట్ల కోవ లక్ష్మణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మజ్లిస్‌తో ఉన్న సత్సంబంధాల వల్లే తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడానికి సీఎం కేసీఆర్‌ సాహసించడం లేదన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం
 
 
2019 సంవత్సరంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తెలంగాణ విమోచణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని 
ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. అమరుల త్యాగాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఉద్యమం అంతం కానిదని, ఆరంభం మాత్రమేనన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వబోమన్నారు. 
 
 
 

 

మరిన్ని వార్తలు