పాఠశాల వేళల్లో మార్పు

15 Mar, 2017 00:44 IST|Sakshi
ప్రాథమిక స్కూళ్లలో 8 నుంచి 12.30 గంటల వరకు తరగతులు
– మద్యాధ్యాహ్నం పరీక్షల నిర్వహణ
– ఉన్నత పాఠశాలల్లో  మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు స్టడీ అవర్స్‌
– 2 నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు
– ‘సాక్షి’ కథనాని స్పందన
 
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమన్యాల కింద నడుస్తున్న పాఠశాలల వేళల్లో మార్పు చేశారు. ఈ మేరకు జిల్లా కామన్‌ పరీక్షల బోర్డు చైర్మన్, డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13 నుంచి స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నెల 14 నుంచి సమ్మెటివ్‌–3 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తికమక నెలకొందని ఈ నెల 10న ‘గందరగోళం’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పరీక్షలకు, విద్యార్థుల తరగతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వేళల్లో కొంత మార్పు చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించాలి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో టీచర్లను సైతం ఉదయం తరగతులకు సగం మంది, మధ్యాహ్నం పరీక్షలకు సగం మంది టీచర్లు హాజరు కావాలని డీఈఓ సూచించారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 12 గంటల నుంచి స్టడీ ఆవర్స్‌ నిర్వహించి, 2 నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలి.
 
ప్రశ్నపత్రాలు లీకేజీ అయితే హెచ్‌ఎంలదే భాద్యత
సమ్మెటివ్‌–3 పరీక్షలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు ఉండే పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి 12 గంటలకు తీసుకుపోయి 2 గంటలకు పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని, ఎక్కడైనా మాస్‌ కాపీయింగ్, ప్రశ్నపత్రాలు లీకేజీ అయితే ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలే బాధ్యత వహించాలన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత 8, 9 తరగతులకు సంబంధించిన సమాధాన పత్రాల బండిళ్లను 100 శాతం బహిరంగా ముల్యాంకనానికి విద్యార్థుల పూర్తి వివరాలు తెలుపూ నమునాను జత పరిచి సంబంధిత ఎంఈఓ కార్యాలయాలకు భద్రతతో అందజేయాలన్నారు.
 
మరిన్ని వార్తలు