సౌకర్యాల్లేని అమరావతికి వెళ్లం!

13 May, 2016 03:48 IST|Sakshi
సౌకర్యాల్లేని అమరావతికి వెళ్లం!

తొలుత జూన్ 30కి వెళ్లడం ఖాయమన్న ఉద్యోగుల సంఘనేత మురళీకృష్ణ
ఉద్యోగుల ఒత్తిడితో మళ్లీ సీఎంను కలుద్దామని వెల్లడి
సౌకర్యాలు కల్పించాకే తరలించండన్న ఉద్యోగులు
మార్చి వరకూ అమరావతికి వెళ్లడం వాయిదా వేయండి: వెంకట్రామిరెడ్డి

 
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతికి సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశం మళ్లీ వివాదాస్పదమవుతోంది. మంత్రులు తలా ఒక మాట చెప్పడం, స్పష్టత లేకపోవడంపై ఉద్యోగులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘ఒక మంత్రి జూన్ 27 నాటికి వెళ్లాలని అంటారు. మరో మంత్రి మే నాటికే వెళ్లాలని అంటారు’ ఇలాగైతే ఎలాగని ఉద్యోగులు తమ సంఘం నాయకుల వద్ద గట్టిగా ప్రస్తావించారు. గురువారం సచివాలయ ఉద్యోగుల సంఘం నిర్వహించిన సర్వసభ్య సమావేశం రభసగా మారింది. జూన్‌లో వెళ్లే నిర్ణయాన్ని మార్చుకుని, మార్చికి వాయిదా వేయాలని పలువురు సూచించారు.

ఇప్పటివరకూ నిర్మాణాలు పూర్తికాకుండానే రోజుకో మాట చెబుతూ ఉద్యోగులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు మండిపడ్డారు. నిర్మాణాలు పూర్తయ్యాకే వెళ్లేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, ఆ మేరకు ప్రభుత్వంతో చర్చించాలని ఉద్యోగుల సంఘం నాయకుడు మురళీకృష్ణను డిమాండ్ చేశారు. జూన్‌లో వెళ్లడానికి 80 శాతం మంది ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ పలువురు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.


అడ్మిషన్లు పూర్తయ్యాయి.. ఎలా వెళ్లగలం?
జూన్‌లో అమరావతికి వెళ్లేందుకు ఉద్యోగులు ససేమిరా అన్నారు. జూన్‌లోనే వెళ్లాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికే విద్యా సంస్ధల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిందని.. పైగా వసతి సదుపాయాలు కూడా అంతంత మాత్రంగా ఉన్న అమరావతి ప్రాంతంలో ఇళ్లు దొరకడం కూడా కష్టంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరానికి తరలింపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సురక్షితంగా తరలిస్తుందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెప్పడంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పష్టమైన హామీలు ఇవ్వకుండా ఎలా వెళ్లగలమని ఆయనతో పలువురు వాగ్వాదానికి దిగారు.


తరలింపును వాయిదా వేయండి..
సచివాలయ ఉద్యోగుల తరలింపును వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సోసైటీ మాజీ అధ్యక్షులు కె. వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. తరలింపునకు ఉద్యోగులు మానసికంగా సిద్ధపడకపోవడమే కాకుండా ఈ అంశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. ప్రభుత్వం రోజుకో తేదీ చెబుతూ గందరగోళం సృష్టిస్తోందన్నారు. జూన్ 27న తరలిస్తామని ఉత్తర్వులు ఇవ్వాలని అడిగితే భవన నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు కుదిరాక ఇస్తారనడం బాధ్యతా రాహిత్యం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిష్టకు పోకుండా తరలింపును వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలని వెంకట్రామిరెడ్డి కోరారు.
 
మళ్లీ సీఎంను కలుద్దాం
జూన్ 30 నాటికి తాము అమరావతికి వెళ్లడం ఖాయమన్న మురళీకృష్ణ ఉద్యోగుల తీవ్ర ఒత్తిడితో మళ్లీ ఒకసారి సీఎంను కలుద్దామని అన్నారు. ఉద్యోగుల తరలింపులో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తమేనని ఆయన అంగీకరించారు. విభజన కారణంగా ముందుగా నష్టపోయిం ది ఉద్యోగులేనని అన్నారు. అమరావతికి వెళ్లే ఉద్యోగులకు తలెత్తే సమస్యలను సీఎం, సీఎస్ దృష్టికి తీసువెళ్లి పరిష్కరించుకుందామన్నారు.

మరిన్ని వార్తలు