జైలుకైనా వెళతా.. వైఎస్సార్‌సీపీని వీడను | Sakshi
Sakshi News home page

జైలుకైనా వెళతా.. వైఎస్సార్‌సీపీని వీడను

Published Fri, May 13 2016 3:57 AM

జైలుకైనా వెళతా.. వైఎస్సార్‌సీపీని వీడను

కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టీకరణ
టీడీపీ అనుకూల పత్రికల్లో తప్పుడు కథనాలపై ఆగ్రహం
కాంట్రాక్టులిస్తాం.. నిధులిస్తామని మంత్రి నారాయణ ఆశజూపారు
అయినా ఒప్పుకోకపోవడంతో కేసులు పెడతామని బెదిరించారు

 
 
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెడితే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేగానీ, వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాను 18న అధికారపక్షంలో చేరుతున్నట్లు టీడీపీ అనుకూల పత్రిక ఒకదానిలో వచ్చిన వార్తల్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీలోకి రావాలని తనను ప్రలోభపెట్టిన మాట వాస్తవమేనని, అయితే తాను నిర్ద్వందంగా తిరస్కరించానని పేర్కొన్నారు. ఇంజనీరుగా, వ్యాపారవేత్తగా ఎదిగిన తాను ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, ఆయన నాయకత్వంపట్ల తనకు సంపూర్ణ విశ్వాసముందని తెలిపారు.

‘‘మా పార్టీలోకి రండి... మీకు పనులిస్తాం(కాంట్రాక్టులు).. మీ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులిస్తాం.. అని జిల్లామంత్రి నారాయణ ఆశజూపారు. అయితే నేను తిరస్కరించా. తర్వాత విజయవాడలో మంత్రి నేనున్న హోటల్‌లో కలసి ‘నువ్వు మంచోడివి... మాపార్టీలోకి రా... కావలి నియోజకవర్గ అభివృద్ధికి బాగా నిధులిస్తాం’ అని చెప్పారు. అయితే వైఎస్సార్‌సీపీని వీడి రాబోనని చెప్పా. మంత్రి మళ్లీ కావలిలో నా ఇంటిక్కూడా వచ్చి ఇదేవిషయం ప్రస్తావిస్తే.. పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టంచేశా. ఆ తర్వాతా పదేపదే ఫోన్లు చేస్తుంటే.. నారాయణ వద్దకెళ్లి టీడీపీలోకి రావాల్సిందిగా అడగడానికైతే నాకు ఫోన్లు చేయవద్దని గౌరవంగా స్పష్టం చేసి, జగన్‌ను వదలి రానని చెప్పేసి వచ్చా.

ఎంతకూ నేను పార్టీ మారడానికి ఒప్పుకోకపోవడంతో మంత్రి చివరకు కేసులు పెడతామని కూడా బెదిరిం చారు’’ అని ప్రతాప్‌కుమార్‌రెడ్డి వివరించారు. తాను అక్రమకేసులకు బెదిరేవాడిని కానని, జైలుకైనా పోతానుకానీ టీడీపీలో చేరేది లేదన్నా రు. తన దృఢవైఖరి చూశాక టీడీపీవాళ్లు కూడా పార్టీలోకి రావాలని అడగడం మానేశారని, అయితే టీడీపీ అనుకూలపత్రిక ఒకదాం ట్లో తాను ఫలానాతేదీన చేరుతున్నట్లు వార్త రాయడం దారుణమన్నారు. పత్రిక ప్రజలకుపయోగపడే వార్తలు రాయాలిగానీ తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.


 ఎక్కడ అవినీతి జరిగినా..
దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ అవినీతి జరిగినా టీడీపీ వారిపేర్లే వినిపిస్తున్నాయని రామిరెడ్డి అన్నారు. పనామా పత్రాల వెల్లడిలో హెరిటేజ్ సంస్థ ైడె రెక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ ఉండటమే అందుకు నిదర్శనమన్నారు. ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియుక్తులైన అజయ్‌దేవగన్ పేరూ అందులో వెల్లడైందన్నారు. చంద్రబాబు తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు బలహీనతలన్నీ ప్రధాని మోదీకి తెలుసునని, అందుకే ప్రత్యేక హోదా విషయంలో సీఎం గట్టిగా పోరాడలేకుండా ఉన్నారని ప్రతాప్ అన్నారు. చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్లవద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి దక్కాల్సిన జలాలకోసం జగన్ జలదీక్ష చేస్తూంటే చంద్రబాబు మాత్రం ధనదీక్ష చేస్తున్నారని విమర్శించారు.
 
నైతికంగా సరికాదు..
ఒక పార్టీ తరఫున ప్రజలు గెలిపించినపుడు ఇంకొక పార్టీలోకి మారడమనేది నైతికంగా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ జిల్లాలో పార్టీ మారిన సునీల్ ను గూడూరు నియోజకవర్గ ప్రజలంతా విపరీతంగా తిడుతున్నారన్నారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చి ప్రజామద్దతు పెంచుకోవాలేతప్ప ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడంద్వారా కాదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీని వదిలెళ్లి ఉండొచ్చని, మిగతావాళ్లం జగన్‌పక్షాన గట్టిగా నిలబడి ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడతామని స్పష్టంచేశారు.
 

Advertisement
Advertisement