బాలుర హాస్టల్‌లో లైంగిక వేధింపులు

6 Feb, 2016 20:31 IST|Sakshi

చేవెళ్ల రూరల్ (రంగారెడ్డి) : 12, 13 ఏళ్ల వయసున్న బాలురు.. తమకన్నా చిన్నవారైన తోటి బాలురపై లైంగిక వేధింపులకు  పాల్పడిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.  చేవెళ్ల మండలం ఆలూరు ఎస్సీ బాలుర వసతి గృహంలో ఈ హేయమైన ఘటన  చోటుచేసుకుంది. నిజమేనని నిర్ధారించిన అధికారులు నిందిత బాలురను హాస్టల్‌ నుంచి తొలగించారు. ఆలూరు ఎస్సీ  బాలుర వసతి గృహంలో 30మంది విద్యార్థులుంటున్నారు. ఇక్కడ మూడో తరగతి నుంచి 8 తరగతి వరకు  విద్యార్థులుంటారు.

అయితే ఎనిమిదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు 5వ తరగతి చదువుతున్న బాలుడిని జనవరిలో లైంగికంగా  వేధించారు. ఆ సీనియర్ విద్యార్థులు షాద్‌నగర్ మండలానికి చెందిన సోదరులే. ఈ ఘటన సంక్రాంతి సెలవులకు ముందు  జరిగింది. సెలవులు పూర్తి చేసుకున్న తరువాత విద్యార్థులందరూ తిరిగి హాస్టల్‌కు చేరుకోగా బాధిత విద్యార్థి మాత్రం  వెళ్లలేదు. హాస్టల్ మ్యాట్రిన్ ఆరా తీయగా సదరు విద్యార్థి అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.

కాగా నవాబుపేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు హాస్టల్‌కు వెళ్లాలని గట్టిగా  గద్దించటంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో వారు శుక్రవారం వసతిగృహానికి వెళ్లి మ్యాట్రిన్‌కు విషయం  తెలిపారు. శనివారం ఎస్‌డబ్ల్యూవో శ్వేత ప్రియదర్శిని, మ్యాట్రిన్ వెన్నెల, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులతో  కలిసి వసతిగృహంలో ఈ విషయంపై చర్చించారు.

అయితే సీనియర్ విద్యార్థులు లైంగిక వేధింపులకు గురిచేసేవారని ఇతర విద్యార్థులు సైతం చెప్పటంతో ఆరోపణలు  ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులను వసతిగృహం నుంచి తీసుకెళ్లాలని వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఇదే విషయాన్ని  పాఠశాల ప్రధానోపాధ్యాయునికి సైతం తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలలు ఇలా ప్రవర్తించటానికి గల కారణాలు  తెలుసుకుని మానసిక వైద్యునికి లేదా నిపుణుడికి చూపించాలని వారి తల్లిదండ్రులకు సూచించినట్లు హాస్టల్ అధికారులు  తెలిపారు.

మరిన్ని వార్తలు