ఆర్నెలల్లో 3వేల గ్రామాలకు తాగునీరు

27 Oct, 2015 05:14 IST|Sakshi
ఆర్నెలల్లో 3వేల గ్రామాలకు తాగునీరు

♦ నిర్దిష్ట లక్ష్యాలతో వేగంగా వాటర్ గ్రిడ్ పనులు
♦ అన్ని జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలతో కేటీఆర్ సమీక్ష
♦ సెగ్మెంట్ల వారీగా నీరిచ్చే తేదీలను ప్రకటించాలని ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్ గ్రిడ్) ద్వారా రాబోయే ఆర్నెళ్లలోపే సుమారు మూడు వేల గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించబోతున్నామని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సోమవారం అన్ని జిల్లాల సూపరింటిండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ తొలిదశను ఏప్రిల్ 30కల్లా పూర్తి చేసి గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాలతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు గ్రామాలకు సురక్షిత తాగునీటి సరఫరా ప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసేందుకు ఇంజనీర్లంతా పట్టుదలతో పనిచేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

 సెగ్మెంట్ల వారీగా తేదీలు ప్రకటించండి...
 వాటర్ గ్రిడ్ పరిధిలోని సెగ్మెంట్ల వారీగా ఏఏ ప్రాంతాలకు నీటి సరఫరాను ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయాన్ని తేదీలతో సహా ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ అన్ని జిల్లాల ఎస్‌ఈలను ఆదేశించారు. డెడ్‌లైన్లు పెట్టుకొని పనులు పూర్తిచేయాలని సూచించారు. జిల్లాస్థాయిలో అవసరమైన అన్ని సదుపాయాలను క ల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిన తాత్కాలిక నియామకాలను చేపట్టాలని సూచించారు.

 అటవీ అనుమతులపై ఆరా...
 జిల్లాల వారీగా పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి కేటీఆర్... ప్రాజెక్ట్‌కు సంబంధించి అటవీ శాఖ నుంచి రావాల్సిన అనుమతులు, భూసేకరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది.. తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ఏర్పాటుచేసిన జిల్లా జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలు ఎలా జరుగుతున్నాయని ఎస్‌ఈలను మంత్రి ప్రశ్నించారు. డిజైన్లను ఆమోదించే అధికారాలను జిల్లా సూపరింటిండెంట్ ఇంజనీర్లకే అప్పగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గ్రిడ్ పనులతో పాటు గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ ఏర్పాటును కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు