దీపం వెలిగేనా?

3 Jun, 2017 01:00 IST|Sakshi
దీపం వెలిగేనా?

పొగలేని పొయ్యిలే లక్ష్యం
ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు
సమస్యల మధ్య  చేతులెత్తేస్తున్న డీలర్లు
నెల రోజుల్లో 92 వేల కనెక్షన్లు మాత్రమే పంపిణీ
మరో వారం రోజుల్లో 94 వేల  కనెక్షన్లు ఎలా ఇస్తారో?


ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్‌ అందిస్తాం.. పొగరహిత జిల్లాగా తీర్చి దిద్దుతాం.. అధికారులకు  సహకరించండి.. గ్యాస్‌ కనెక్షన్‌ పట్టుకెళ్లండి’ అంటూ ఊదరగొడుతున్న పాలకుల మాటలకు.. క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరుకు పొంతన లేకుండా పోతోంది. నెల రోజుల్లో 1.86 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటివరకు అందులో సగం కూడా పూర్తిచేయలేకపోయారు. మిగిలింది వారం రోజులు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో అర్హులందరికీ గ్యాస్‌ కనెక్షన్లు ఎలా మంజూరు చేస్తారో.. సీఎం ఇలాకాను పొగరహిత జిల్లాగా ఎలా తీర్చిదిద్దుతారో ఆ చంద్రన్నకే తెలియాలి?

చిత్తూరు (కలెక్టరేట్‌):
జిల్లాలో ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రహసనంగా మారింది. అనేక సమస్యల మధ్య డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ఎలాగైనా లక్ష్యాన్ని అధిగమించాల్సిందేనని పాలకులు హుకుం జారీ చేయడంతో.. ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు.

భారీ లక్ష్యం
జిల్లాలో తెలుపు రేషన్‌ కార్డులు కలిగివున్న కుటుంబాలు 10.84 లక్షలు. ఇందులో గ్యాస్‌ కనెక్షన్‌లు కలిగి ఉన్న కుటుంబాలు 7.93 లక్షల వరకు ఉన్నాయి. మరో 2.85 లక్షల తెలుపు రేషన్‌ కార్డుదారులకు గ్యాస్‌ కనెక్షన్‌లు లేవ ని ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలింది. ఇందులో 1.86 లక్షల కుటుంబాలకు దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించా యి. ఆ మేరకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఈ నెల 7వ తేదీలోపు అందరికీ గ్యాస్‌ కనెక్షన్లు అందజేసి జిల్లాను పొగరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పాలకులు హుకుం జారీ చేశారు.

ఇప్పటివరకు పంపిణీ చేసింది 92 వేల గ్యాస్‌ కనెక్షన్లే
దీపం పథకం కింద ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్లు అందించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. నెల రోజుల నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులకు, గ్యాస్‌ ఎజెన్సీల డీలర్లకు, సేల్స్‌ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులకుగాను జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 92 వేల కనెక్షన్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. లక్ష్యానికి మరో వారం రోజుల్లో 94 వేల గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అధికారులు నిత్యం సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీచేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

సమస్యలు అనేకం
గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి గ్యాస్‌ కనెక్షన్‌ లేనివారు తీసుకోవాలని అధికారులు ఒత్తిడి తేవాల్సి వస్తోంది.
కనెక్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఒకే కుటుంబంలో రెండు రేషన్‌ కార్డులు ఉన్న వారు దీపం కనెక్షన్లకు ముందుకు రావడం లేదు.
వేలాదిగా గ్యాస్‌ కనెక్షన్లు అందించేందు అవసరమైన మేరకు ఆయా గ్యాస్‌ కంపెనీల నుంచి స్టాక్‌ రావడం లేదు.
దీపం పథకం ద్వారా అందించే అదనపు సిలిండర్ల నిల్వకు తగ్గట్టుగా గోడౌన్లు లేవు.
 

మరిన్ని వార్తలు