‘అనంత’పై ప్రత్యేక నిఘా!

18 Mar, 2017 23:28 IST|Sakshi

– విద్యాశాఖకు ముచ్చెమటలు పట్టించిన పేపర్‌ లీక్‌
– రెండో రోజు టీ, కాఫీకి కూడా అటెండర్‌ను బయటకు పంపని వైనం
– మడకశిర ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్పీకి విద్యాశాఖ లేఖ


అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదో తరగతి తెలుగు పేపర్‌–1 లీకు ఘటనతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర అధికారులు ‘అనంత’పై ప్రత్యేక నిఘా ఉంచారు. మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో ఓ విద్యార్థిని నుంచి కిటికీలో ప్రశ్నపత్రం తీసుకుని సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి బయటకు తీసుకొచ్చిన యువకులు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన సంగతి తెలిసిందే. తొలుత ఈ ఘటన మన జిల్లాకు సంబంధం లేదంటూ కొట్టిపారేసిన అధికారులు... సదరు విద్యార్థిని హాల్‌టికెట్‌ నంబరు ప్రశ్నపత్రం మీద ఉండడంతో అది మడకశిర కేంద్రం నుంచి అని తేలడంతో ఖంగుతిన్నారు.

ఈ ఘటనతో జిల్లా అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఈ తరహా ఘటన ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం జరిగిన తెలుగు పేపర్‌–2 పరీక్షలో ప్రత్యేక నిఘా ఉంచారు. చాలా కేంద్రాల్లో చివరకు అటెండర్లను సైతం టీ, కాపీల కోసం బయటకు పంపలేదు. పోలీసులు కాపలా ఉండి పరీక్ష ప్రారంభానికి కేంద్రంలోకి వెళ్లినవారిని తిరిగి పరీక్ష ముగిసేదాకా బయటకు రాకుండా,  బయటివారు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.

నిఘా పెంచిన అధికారులు
పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు నిఘా పెంచారు. ఉదయం పోలీస్‌ స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలు తీసుకెళ్లి...పరీక్ష పూర్తయ్యేదాకా అడుగడుగునా నిఘా ఉంచారు. ప్రాంతీయ ఉప సంచాలకులు ప్రతాప్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ప్రభుత్వ  పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడంతో పాటు పర్యవేక్షించారు. ఆర్జేడీ అనంతపురం, కదిరి, కొత్తచెరువు ప్రాంతాల్లో ఏడు కేంద్రాలు, డీఈఓ తొమ్మిది కేంద్రాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 78 కేంద్రాలు తనిఖీలు చేశాయి. తెలుగు పేపర్‌–2 పరీక్షకు జిల్లాలో మొత్తం 49,278 మంది విద్యార్థులకు గాను 49,025 మంది హాజరయ్యారు. 253 మంది గైర్హాజరయ్యారు.

పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్పీకి విద్యాశాఖ లేఖ
మడకశిర పేపరు లీకు ఘటనలో స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై విద్యాశాఖ అధికారులు ఎస్పీ రాజశేఖర్‌బాబుకు లేఖ రాశారు. చుట్టూ కాంపౌండ్‌ ఉన్నా...అదికూడా పరీక్ష ప్రారంభమైన తర్వాత నలుగురు యువకులు కేంద్రంలోకి ఎలా వెళ్లారు..పోలీçసులు ఏం చేస్తున్నారు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఇదిలాఉండగా పేపరు లీక్‌ ఘటనలో మరింత మంది మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేశారు. సదరు విద్యార్థినిని డీబార్‌ చేశారు. పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. నివేదిక రాగానే సంబంధిత చీప్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్‌ అధికారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిసింది. ఏది ఏమైనా మడకశిర ఘటనతో అధికారుల్లో చలనం వచ్చింది.

>
మరిన్ని వార్తలు