అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

9 Apr, 2017 15:38 IST|Sakshi
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

► పొలం గట్టుపై లభించిన మృతదేహం
► గుట్టుగా దహనం చేసేందుకు యత్నం
► అడ్డుకున్న పోలీసులు


కాశీబుగ్గ : పలాస మండలం సమస్యాత్మక గ్రామం పెదంచలలో శనివారం అనుమానాస్పద స్థితిలో సంజీవి గురుమూర్తి(38) అనే వ్యక్తి మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని దహనం చేసేందుకు గురుమూర్తి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా.. సమాచారం తెలుసుకున్న కాశీబు గ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్సై కేవీ సురేష్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు సంజీవి గురుమూర్తి.. భార్యాపిల్లలతో పెదంచల గ్రామంలో నివసిస్తున్నాడు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఖాళీ సమయంలో కులవృత్తిలో భాగంగా గానుగును ఆడిస్తుంటాడు. శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన గురుమూర్తి.. ఎంతసేపటికీ ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా.. పొలం గట్టుపై అచేతనంగా పడి ఉండడాన్ని గమనించారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. మృతదేహాన్ని ఇంటికి తరలించి, గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. ఆ తతంగాన్ని అడ్డుకున్నారు.

గురుమూర్తి మెడపై తువ్వాలుతో గట్టిగా బిగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. తలపై రక్తంతో గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొలం గట్టుపై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టంలో గురుమూర్తి ఏ విధంగా మృతి చెందాడనే విషయాన్ని చెప్పగలమని సీఐ స్థానిక విలేకరులకు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా.. గురుమూర్తి మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం భార్య అరుణతో అతను గొడవ పడినట్లు తెలుస్తోంది. అతను మృతి చెందిన సమయంలో భార్య అరుణ తన కన్న వారింట్లో ఉన్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం జరిగిన భార్యభర్తల గొడవల్లో గురుమూర్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు