తహశీల్దార్‌కు మూడేళ్ల జైలు

28 Oct, 2015 08:28 IST|Sakshi
తహశీల్దార్‌కు మూడేళ్ల జైలు

విజయవాడ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విజయవాడ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఓ తహశీల్దారుకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.60 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలానికి తహశీల్దార్గా నాగేశ్వరరావు 2007 నవంబర్లో పని చేశారు. అదే మండలం వోడపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, రామారావు, పేరిరాజులకు తమ పూర్వీకుల నుంచి కొంత లంక భూములున్నాయి. కొందరు వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించి సాగుచేయడానికి ప్రయత్నిస్తుండగా, బాధితులు అధికారులను సంప్రదించారు. అక్రమంగా సాగుచేసుకుంటున్న వారికే తహశీల్దార్ నాగేశ్వరరావు వత్తాసు పలికారు.

ఈ నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపి సమగ్ర నివేదిక పంపాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్ తహశీల్దారు నాగేశ్వరరావుకు ఆ బాధ్యతలు అప్పగించగా, విచారణలో ఫిర్యాదుదారులకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే రూ.20 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వారు రాజమండ్రి రేంజి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిందితుడు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పారు.

మరిన్ని వార్తలు