అధికారం వారికి తిరుగులేని అస్త్రమైంది

27 Dec, 2015 01:13 IST|Sakshi
అధికారం వారికి తిరుగులేని అస్త్రమైంది

అధికారం వారికి తిరుగులేని అస్త్రమైంది. ఏ దందా చేసినా... అదుపు చేసే యంత్రాంగం కరువైంది. చెరువులో మట్టి తవ్వేసి అమ్ముకోవడం... బెల్టుదుకాణాలకు ఏకంగా బహిరంగంగా వేలం వేయడం... ఎక్కడికక్కడే ఇసుకను అక్రమంగా తవ్వేసి తరలించేయడం... మహిళా సంఘాలకు మాత్రమే ఇవ్వాలనుకున్న ఇసుక రీచ్‌ను తనకే అప్పగించాలని అధికారులను బెదిరించడం... ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణమైపోయింది. తాజాగా అనుమతుల్లేకుండా అడ్డగోలుగా గ్రావెల్ రెండు నెలలుగా తరలించేస్తూ లక్షలు ఆర్జిస్తున్నా... అధికారులేమీ అనలేకపోతున్నారు. ఇదీ గజపతినగరం నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ వ్యవహారం.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం/గంట్యాడ: గంట్యాడ మండలం మదనాపురం గ్రామ సమీపంలో గల ప్రాంతీయ వన సంరక్షణ సమితికి దగ్గరలో విలువైన గ్రావెల్ లభ్యమవుతోంది. సర్వే నంబర్ 52/6, 52/7లో గల కొండ ప్రాంతంలో మైనింగ్ అధికారులు ఓ వ్యక్తికి తవ్వకానికి అనుమతి ఇచ్చారు. కానీ దీనిని ఆసరాగా చేసుకుని ఆ పక్కనే ఉన్న స్థలంలో ఎమ్మెల్యే అనుచరుడు, టీడీపీ మండల ప్రజాప్రతినిధికి బావమరిది దగ్గరుండి ఎటువంటి అధికారిక అనుమతులులేకుండానే గ్రావెల్ తవ్వకాలు జరిపిస్తున్నారు.
 
 పొక్లెయిన్ పెట్టి రెండు నెలలుగా తవ్వకాలు జరిపి, లారీల ద్వారా గ్రావెల్ తరలించేస్తున్నారు. గతంలో వేరే రోడ్డు పనులకు ఉపయోగించగా, ప్రస్తుతం తాటిపూడి రిజర్వాయర్ ముఠా చానల్‌కు ఆనుకుని మరడాం నుంచి రామభద్రపురం వరకు వేస్తున్న రోడ్డు పనులకు దీనిని వాడుతున్నారు. రోజుకు దాదాపు 50లారీల వంతున ఇప్పటి వరకు 3వేల లారీలతో గ్రావెల్ తరలించేసినట్టు తెలుస్తోంది. ఒక్కో లారీ లోడు విలువ రూ. 1500లు ఉంటుంది. ఈ లెక్కన రూ. 45లక్షలు విలువైన గ్రావెల్ తరలిపోయినట్టు స్పష్టమవుతోంది.
 
 పట్టించుకోని అధికారులు

 ఇన్ని నెలలుగా అడ్డగోలు తవ్వకాలు చేపడుతున్నా ఏ అధికారీ ఆపే ప్రయత్నం చేయలేదు. కళ్ల ముందే లక్షలాది రూపాయల విలువైన గ్రావెల్ తరలిపోతున్నా... ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా... చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దీనిని గమనించిన సిరిపురం ఎంపీటీసీ, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్ ఒక అడుగు ముందుకేసి గ్రావెల్ తవ్వకాలను శనివారం అడ్డుకునే ప్రయత్నం చేశారు.
 
 తవ్వకాలు దగ్గరుండి జరిపిస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తి కలగ చేసుకుని ఎమ్మెల్యే పనులకు ఉపయోగిస్తున్న గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటారా? ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ ఉన్నా ఎందుకు అడ్డు చెబుతున్నారని వాదనకు దిగారు. తవ్వకాలకే అనుమతుల్లేనప్పుడు తరలింపేంటని ప్రశ్నించగా కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయమై తహశీల్దార్ బాపిరాజు వద్దకెళ్లి జైహింద్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారని ఆయన్ను నిలదీయగా అక్కడ అనుమతుల్లేవని, తవ్వకాలు జరుపుతున్నట్టు తెలియదని, వీఆర్‌ఓతో పాటు ఆర్‌ఐని పంపించి తవ్వకాలు నిలిపివేయిస్తానని ఆయన్ను శాంతపరిచారు.
 
 ఎమ్మెల్యేకు భయపడే...
 అన్నీ తెలిసినా అధికారులు దీనిపై నోరుమెదపడం లేదు. ఎవరైనా అడిగితే తమ దృష్టికి రాలేదంటూ తాత్కాలికంగా తప్పించుకుంటున్నారు. దీనంతటికీ కారణం అక్కడి ఎమ్మెల్యే వారి వెనుక ఉండటమే. అధికారులు తమ విచక్షణాధికారాన్ని వినియోగిస్తే... వారిని ఎమ్మెల్యే టార్గెట్‌చేసి ఇరుకున పెడతారనే భయం. ఇదే అదనుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా టీడీపీ దందా విచ్చలవిడిగా సాగుతోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్ సాక్షి వద్ద వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు